హెల్త్ కమీషన్‌కు, నకిలీల వైద్య నియంత్రణకు తాను సిద్ధమే: ప్రొఫెసర్ కోదండరాం
రాష్ట్రంలో నకిలీ వైద్యం ఉందన్న విషయం కాదనలేని సత్యమని, అయితే నియంత్రణకు తాను సిద్ధమే, కానీ నిర్మూలన వెంటనే సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
దిశ,కార్వాన్ : రాష్ట్రంలో నకిలీ వైద్యం ఉందన్న విషయం కాదనలేని సత్యమని, అయితే నియంత్రణకు తాను సిద్ధమే, కానీ నిర్మూలన వెంటనే సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీ అవసరం అని, అలాగే వైద్యులు విజ్ఞప్తి చేసిన విధంగా రాష్ట్రంలో విద్యా కమీషన్‌లాగానే హెల్త్ కమీషన్‌ను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం నాడు స్థానిక ఐఎంఎ ప్రధాన కార్యాలయంలో ఐఎంఎ అధ్యక్షులు డాక్టరు దువ్వూరు ద్వారకానాధరెడ్డి అధ్యక్షతన, సెక్రటరీ డాక్టర్ ఆశోక్, యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆశోక్‌రెడ్డిల ఆధ్వర్యంలో కోటిలోని ఐఎంఎ హాల్‌లో ప్రజారోగ్యానికి వ్యతిరేకంగా నకిలీ వైద్యం అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో నకిలీ వైద్యాన్ని అందిస్తున్న క్వాక్స్‌కు తగిన శిక్షణ ఇప్పించి, పారామెడిక్స్ వ్యవస్థలో భాగం చేసి ప్రమాదకర వైద్యం ప్రజలకు అందకుండా చేయడానికి అందరూ కృషి చెయ్యాల్సి ఉందని ప్రొఫెసర్ కోదండరాం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోదండరాం ప్రతిపాదనపై పెద్ద ఎత్తున వైద్యులంతా సభలో నిరసన వ్యక్తం చేశారు.
నకిలీ విత్తనాలు, నకిలీ మందుల్ని ప్రభుత్వం ఏరివేసినట్లుగా నకిలీ వైద్యం చేసే వారిని పట్టణాలు`గ్రామాల్లో ఉన్నవారికి గడువిచ్చి నిర్మూలించేలా చట్టం తీసుకురావాలని డాక్టరు కోదండరాం ను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే ప్రభుత్వం ద్వారా హెల్త్ కమీషన్ ఏర్పాటు చేసేలా అందరూ వత్తిడి తీసుకురావాలని వక్తలు ముక్తకంఠంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ నిపుణులు, యాంటీ క్వాక్స్ కమిటీ, జనవిజ్ఞానవేదికల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం` ప్రజారోగ్యానికి వ్యతిరేకంగా నకిలీ వైద్యం అనే అంశంపై ఐఎంఎ హాల్‌లో చర్చ జరిగింది. అనంతరం ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ టి. దయాళ్‌సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే ఆరోగ్య రంగానికి నిధులు పెంచాలన్నారు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోవడం వల్లనే ఈరోజున తెలంగాణలో చేతబడులు చేసేవాళ్ళను, నకిలీ వైద్యులను ప్రోత్సహించినట్లయిందని జన విజ్ఞాన దర్శిని సభ్యులు డాక్టర్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ వైద్యులకు కూడా కమ్యూనిటీ పారామెడిక్స్‌గా తగిన శిక్షణ ఇచ్చినపుడు మాత్రమే ఈ రాష్ట్రంలో ఆరోగ్యం భద్రంగా ఉంటుందన్నారు. మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన వైద్యనిపుణులు ఇప్పటికీ రాష్ట్రంలో లేరని, 50 శాతం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం వైద్యులకు తగిన శిక్షణ ఇచ్చి నియమించకపోవడం వల్లనే నకిలీ వైద్యులు ఆ ప్రాంతంలో భర్తీఅవుతున్నారని జన విజ్ఞాన వేదిక సభ్యులు, యురాలజిస్ట్ డాక్టర్ గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం టిజిపంసి వైస్ చైర్మన్ డాక్టర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. నకిలీ వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్నవారిని ఎన్‌ఎంసి తరపున 412 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు.
వందలాది కేసుల్లో విచ్ఛలవిడిగా నకిలీ వైద్యులు యాంటీబయోటిక్స్ వినియోగించడం వల్ల శరీరంలోని అవయవాలన్నీ పనిచేయక చనిపోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం తక్షణమే 24/7 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లను నియమించి, వారు పనిచేసేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని ఎంఎల్‌సి కోదండరాంకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఐఎంఎ తెలంగాణ రాష్ట్ర పలక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ కిషన్ మాట్లాడుతూ నకిలీ వైద్యులను పట్టణాల్లోను, గ్రామాల్లోను ఏరివేయడంపైన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి` ప్రజారోగ్య తెలంగాణ తీసుకురావాలని కోదండరాంకు విజ్ఞప్తి చేశారు. ఎంసిఐ సభ్యులు డాక్టర్ ప్రతిభాలక్ష్మి మాట్లాడుతూ తాము గ్రామాలతోబాటు పట్టణాల్లో క్వాక్స్‌పై దాడులు జరిపినపుడు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అని ఐఎంఎ
డాక్టర్ రజిత యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్,మన ట్రోపికల్ స్టిరాయిడ్స్‌ను యాంటీ ఫంగల్‌గా పరిగణించి గ్రామీణ ప్రాంతాల్లోని నకిలీలు వైద్యం చేయడం వల్ల అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చుకోవడం తో పాటుగా, చిన్న చిన్న జబ్బులకు లక్షల రూపాయలు ఖర్చుచేసుకోవాల్సి వస్తోందన్నారు. డాక్టర్ బుర్రి రంగారెడ్డి మాట్లాడుతూ… ప్రజారోగ్యం మెరుగపడాలంటే ప్రాథమిక వైద్య ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జూమ్ ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీంధ్రరెడ్డి మాట్లాడుతూ… సిటీల్లో నర్సింగ్‌హోవమ్స్‌ను నెలకొల్పడం విషాదం అన్నారు. తెలంగాణ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నాయకులు డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి నకిలీలను ప్రోత్సహించ వద్దని, రేపు ఎవరైనా రోగిగా మారినపుడు అర్హుడి వద్ద వైద్యం చేసుకోవాలన్న హక్కును కాపాడండని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ మహాలక్ష్మి మాట్లాడుతూ నకిలీలను ప్రభుత్వం ప్రోత్సహించకుండా నిరోధించాలన్నారు.