హెచ్ఎండీఏ నయా దందా.. చెట్ల పైన కమిషన్?

అభివృద్ధి పేరిట హెచ్ఎండీఏ నయా దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. కార్ రేసింగ్, ఈ ఫార్మూలా నిర్వహణ పేరుతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో

Update: 2023-05-10 02:21 GMT

దిశ, సిటీబ్యూరో : అభివృద్ధి పేరిట హెచ్ఎండీఏ నయా దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. కార్ రేసింగ్, ఈ ఫార్మూలా నిర్వహణ పేరుతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న చెట్లను తొలగించిన అధికారులు తాజాగా వాటి స్థానంలో భారీగా డబ్బులు వెచ్చించి కొత్త చెట్లు నాటించింది. ఎన్టీఆర్ పార్క్ ఎదుట నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఉన్న రోడ్డుకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 10 నెలల కాలంలో రూ.కోట్లు వెచ్చించి మరమ్మతులు చేయించారు. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన కార్ రేసింగ్ లీగ్ సందర్భంగా, అంతకు ముందు నుంచే సుమారు రూ.140 కోట్లు వెచ్చించి స్ట్రీట్‌ట్రాక్ ఏర్పాటు చేశారు.

అదే సమయంలో డెవలప్‌మెంట్ పేరుట అక్కడ ఉన్న చెట్లను అధికారులు తొలగించారు. వాటి స్థానంలో తాజాగా సుమారు 100 వరకు పెద్ద సైజు చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో ఇక్కడున్న చెట్లు వీటికంటే రెండింతలు పెద్దగా ఉండేవి. కానీ అధికారులు వీటిని కాదని తిరిగి కొత్తవి నాటడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్న చెట్లను నరికేయడం ఎందుకు? వాటిని కాదని మళ్లీ కొత్తగా కొనుగోలు చేసి నాటడం ఎందుకు? ఇది ఎవరి ప్రయోజనం కోసం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కమీషన్ల కోసమేనా?

కార్ రేసింగ్, కొత్త సచివాలయ నిర్మాణం పేరిట చెట్లను నరికేసిన హెచ్ఎండీఏ అధికారులు.. మళ్లీ కొత్తగా చెట్లు కొనుగోలు చేసి నాటడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికన్నా మేలురకం ఉన్న చెట్లను ఉచితంగా ట్రాన్స్ రీ లొకేషన్ ద్వారా నాటే అవకాశం ఉన్నా..అధికారులు కొత్తగా సుమారు 100 చెట్లను కొనడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిలో ఒక్కో చెట్టు ఖరీదు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఉంటుందని తెలిసింది. ఇదంతా అధికారులు కమీషన్ల కోసమే చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ చెట్లకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. చెట్ల వివరాలు తెలుసుకునేందుకు ‘దిశ’ ప్రయత్నించగా సంబంధిత విభాగం అధికారులు స్పందించలేదు.

Tags:    

Similar News