నగరంలో భారీ వర్షం.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్లు
నగరంలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది.
దిశ, శేరిలింగంపల్లి : నగరంలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తం కావడంతో పాటు ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు భారీ వర్షం కురియడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు రావడంతో సామాగ్రి నీట మునిగి ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
శేరిలింగంపల్లి రైల్వే బ్రిడ్జి, చందానగర్ మెయిన్ రోడ్డు, మియాపూర్, బాచుపల్లి రోడ్డు, హఫీజ్ పేట్, కొండాపూర్, మాదాపూర్, హైదర్ నగర్, వివేకానంద నగర్ లలో లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. డ్రైనేజీలో చెత్తా చెదారం పేరుకు పోవడంతో మురుగునీరు జామ్ అయి రోడ్లపై భారీగా నీరు నిలిచింది. ఖాజాగూడ జంక్షన్ వద్ద చెట్లు కూలి రోడ్డు పక్కన ఉన్న కార్లపై పడడంతో పలు వాహనాలు స్వయండం అయ్యాయి. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఇతర పోలీసు సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.