విస్తరణ దిశగా టెక్‌వేవ్: 3 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
ప్రముఖ గ్లోబల్ ఐటి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ సంస్థ టెక్‌వేవ్ తెలంగాణ రాష్ట్రంలో మరింతగా విస్తరించనుంది..
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ గ్లోబల్ ఐటి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ సంస్థ టెక్‌వేవ్ తెలంగాణ రాష్ట్రంలో మరింతగా విస్తరించనుంది. శనివారం హైదరాబాద్నగరంలోఏర్పాటు చేస్తున్న తన గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని టెక్ పార్క్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త అత్యాధునిక టెక్‌వేవ్ సంస్థ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఉద్యోగుల సంఖ్య 2 వేల నుండి 3 వేల వరకు పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ 220కి పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు (GCC) నిలయంగా ఈ సంస్థ ఉందని, ఈ సంఖ్యను 400కి పెంచాలనే లక్ష్యంతో ముందుకు రావడం అభినందించదగ్గ విషయం అన్నారు. రాజధాని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రంలో వరంగల్ తదితర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల ప్రజలు ప్రయోజనం పొందుతారన్నారు. ఇన్నోవేషన్, స్కిల్లింగ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఐటి రంగం మరింత వృద్ధి చెందుతుందన్నారు. ముఖ్యంగా టెక్‌వేవ్ యొక్క కొత్త సదుపాయం ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు అని, ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , ఐటి సలహాదారు సాయి కృష్ణ, టెక్‌వేవ్ ఛైర్మన్దామోదర్ రావు గుమ్మడపు తదితరులు పాల్గొన్నారు.