GHMC: నిర్మాణ వ్యర్థాలపై నిఘా.. డంప్ చేస్తే జరిమానా తప్పదు
గ్రేటర్‌లో భవన నిర్మాణ వ్యర్థాలపై జీహెచ్ఎంసీ నిఘా పెట్టింది.

దిశ, సిటీబ్యూరో : గ్రేటర్‌లో భవన నిర్మాణ వ్యర్థాలపై జీహెచ్ఎంసీ నిఘా పెట్టింది. మట్టి కుప్పలు, నిర్మాణ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ డంప్ చేస్తే ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉత్పత్తి అవుతున్న మట్టి, నిర్మాణ వ్యర్థాలు పేరుకుపోకుండా వాటిని రీసైక్లింగ్ చేయడానికి నాలుగు భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వాటిలో జీడిమెట్ల, ఫత్తుల్లగుడలోని ప్లాంట్లను రాంకీకి చెందిన ఎం/ఎస్ హైదరాబాద్ సీఅండ్ డీ వేస్ట్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థకు అప్పగించారు. మరో రెండు ప్లాంట్లను ఎం/ఎస్ సోమ శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి అప్పగించారు. 30 సర్కిళ్లలోని చెరో 15 సర్కిళ్ల చొప్పున కేటాయించారు. సంబంధిత సర్కిళ్లలో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను సదరు ఏజెన్సీవాళ్లు సేకరించాలని నిర్ణయించారు. కానీ ఈ వ్యర్థాలకు సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా కొంత రాత్రికిరాత్రే రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో డంప్ చేస్తున్నారు.
టిప్పింగ్ ఫీజు ఇలా..
గ్రేటర్‌లో భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించడంతో పాటు ప్రాసెసింగ్ చేయడానికి టిఫ్పింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. జీడిమెట్ల ప్లాంట్ పరిధిలోని సర్కిళ్లలో నిర్మాణ వ్యర్థాలను సేకరించడంతోపాటు ప్రాసెసింగ్ చేయడానికి మెట్రిక్ టన్నుకు రూ.419 వసూలు చేస్తున్నారు. లేదంటే వ్యర్థాలను ఉత్పత్తి చేసిన వ్యక్తి సొంత వాహనం ద్వారా ప్లాంట్‌కు తరలిస్తే ప్రాసెసింగ్ ఫీజు రూ.104.75 చెల్లించాలి. ఫతుల్లాగుడ పరిధిలోని సర్కిళ్లలో రవాణ, ప్రాసెసింగ్ చేయడానికి మెట్రిక్ టన్నుకు రూ.408.70, ప్రాసెసింగ్ చేయడానికే అయితే రూ.102.17 చెల్లించాలి. శంషాబాద్ ప్లాంట్ పరిధిలోని సర్కిళ్ల పరిధిలో మెట్రిక్ టన్నుకు రూ.405, ప్రాసెసింగ్ కోసం రూ.101.25, తూముకుంట ప్లాంట్ పరిధిలోని సర్కిళ్లల్లో అయితే మెట్రిక్ టన్నుకు రూ.435, ప్రాసెసింగ్ చేయడానికి రూ.108.75 చెల్లించాల్సి ఉంది. ఇదికాకుండా రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో డంప్ చేసిన నిర్మాణ వ్యర్థాలను సేకరించాల్సి వస్తే దానికి సంబంధించిన టిప్పింగ్ ఫీజును జీహెచ్ఎంసీనే చెల్లించాలి. ఫలితంగా జీహెచ్ఎంసీపై అదనపు భారం పడుతుంది.
మట్టికుప్పలపై నిఘా..
గ్రేటర్‌లో నిర్మాణ వ్యర్థాల డంప్‌లను నివారించడానికి జీహెచ్ఎంసీ నిఘా పెట్టింది. సర్కిళ్ల పరిధిలో అసిస్టెంట్ మెడికల్ ఆపీసర్లు, డిప్యూటీ ఎగ్జీక్యూటీవ్ ఇంజినీర్లు(శానిటేషన్)లతో కలిసి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. ఎక్కడైనా అక్రమంగా మట్టికుప్పలను డంప్ చేస్తే సదరు అధికారులను బాధ్యులను చేయాలని నిర్ణయించారు. ఒక వేళ జీహెచ్ఎంసీ, జలమండలి, టీజీఎస్పీడీసీఎల్, ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వ్యర్థాలు పేరుకుపోతే సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీకి పెనాల్టీ వేసేవిధంగా జీహెచ్ఎంసీ నిబంధనలు రూపొందించింది.
రూ.42 లక్షల పెనాల్టీ..
మట్టి కుప్పలు, నిర్మాణ వ్యర్థాల అక్రమంగా డంప్ చేసినందుకుగాను జీహెచ్ఎంసీ రూ.42.20 లక్షల పెనాల్టీ వేసింది. ఒక్క జనవరిలోనే రూ.14.24 లక్షల పెనాల్టీ వేశారంటే ఏస్థాయిలో డంప్ చేశారో చెప్పాల్సిన అవసరంలేదు. 762 ప్రాంతాల్లో 1,158 డంపింగ్ పాయింట్లను గుర్తించారు. కాప్రా సర్కిల్‌లో అత్యధికంగా 137 పాయింట్లను గుర్తించి రూ.5.52 లక్షల పెనాల్టీ వేశారు. తర్వాత స్థానంలో కూకట్‌పల్లి రూ.4.26లక్షలు, చందానగర్ రూ.4.09 లక్షలు, కుత్బుల్లాపూర్ రూ.3.65 లక్షలు, శేరిలింగంపల్లి రూ.3.59 లక్షలు, ఉప్పల్ సర్కిల్‌లో రూ.3.38 లక్షల పెనాల్టీ వేశారు. ఒక వేళ ప్రయివేటు వాహనాలు మొదటి సారి డంప్ చేస్తే రూ.25 వేలు, రెండోసారి చేస్తే రూ.50 వేలు, మూడోసారి చేస్తే రూ.లక్ష పెనాల్టీ వేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేసే అవకాశమూలేకపోలేదు. వ్యక్తిగతంగా మురికివాడలో అయితే రూ.5వేలు, బిల్డర్, కాంట్రాక్టర్, వాణిజ్య సంస్థలు అయితే రూ.25వేల వరకు పెనాల్టీ వేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగరంలో అక్రమంగా నిర్మాణ వ్యర్థాలను డంప్ చేసే జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోందని కమిషనర్ హెచ్చరించారు. ఈవిషయంలో ఉపేక్షించేదిలేదన్నారు.