Fire accidents : గ్రేటర్లో వరుస అగ్నిప్రమాదాలు..
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో నగరంలోని క్రాకర్స్
దిశ,హైదరాబాద్ బ్యూరో : దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో నగరంలోని క్రాకర్స్ దుకాణాలలో చోటు చేసుకుంటున్న వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా వేల సంఖ్యలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తుండగా నిర్వాహకుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు హరిస్తోంది . కోట్లాది రూపాయల ఆస్తి నష్టం చోటు చేసుకుంటోంది. బొగ్గులకుంట లోని పరాస్ కార్పొరేషన్ లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదాన్ని మరువక ముందే గంటల వ్యవధిలో పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో పటాకులు నిల్వ ఉంచిన ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఇద్దరు నిద్రలోనే అగ్నికి ఆహుతి కాగా మరొకరు గాయాలపాలయ్యారు. ఈ రెండు సంఘటనలు క్రాకర్స్ వ్యాపారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్షంగా నిలుస్తున్నాయి.
వ్యాపారం నిర్వహించుకునేందుకు ఒకలా అనుమతులు పొంది అందుకు విరుద్ధంగా వ్యాపారాలు ఏర్పాటు చేస్తున్నవారు కొంతమందైతే మరికొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండానే ఎక్కడపడితే దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని తనిఖీ చేయడం, నియంత్రించడంలో ఓ వైపు అగ్నిమాపక సిబ్బంది, మరోవైపు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల ఇండ్లలో గుట్టు చప్పుడు కాకుండా, పక్క వారికి కూడా తెలియకుండా క్రాకర్స్ భారీ ఎత్తున నిల్వ ఉంచుతుండడం ప్రమాదాలకు కారణమౌతుండగా పాతబస్తీలో చోటు చేసుకున్న సంఘటన రుజువు గా నిలుస్తోంది.
అనుమతులు ఉన్నవి 6,104 మాత్రమే...
గ్రేటర్ హైదరాబాద్ లో ఫైర్ విభాగం అనుమతులు పొంది ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణాలు కేవలం 6,104 మాత్రమే ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం పర్మినెంట్ ఫైర్ క్రాకర్స్ గోదాం ల కోసం 58 దరఖాస్తులు తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ , ఎమెర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అధికారులకు వచ్చాయి. వీటిల్లో 2 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా 51 వాటికి అనుమతులు ఇచ్చారు. మరో 5 రిజెక్ట్ అయ్యాయి. 100 కేజీల నుండి 300 కిలోల లోపు పర్మినెంట్ ఫైర్ క్రాకర్స్ హోల్ సేల్ దుకాణాల అనుమతి కోసం 129 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో 114 కు అనుమతులు జారీ చేయగా 5 పెండింగ్ లో ఉన్నాయి. 10 రిజెక్ట్ అయ్యాయి. అలాగే హోల్ సేల్ గా 100 కిలోల నుంచి 300 కిలోల లోపు ప్రపోస్డ్ పర్మినెంట్ ఫైర్ క్రాకర్స్ ఏర్పాటు కోసం 64 దరఖాస్తులు రాగా 6 పెండింగ్ లో ఉన్నాయి. మరో 6 రిజెక్ట్ చేయగా 52 దుకాణాలకు అధికారులు అనుమతులు జారీ చేశారు . ఇక తాత్కాలికంగా ఫైర్ క్రాకర్స్ దుకాణాల కోసం 6,685 దరఖాస్తులు రాగా 5876 దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. 660 దుకాణాల అనుమతులు పెండింగ్ లో పెట్టగా 149 దరఖాస్తులు రిజెక్ట్ చేశారు . ఈ గణాంకాలే అధిక సంఖ్యలో అనుమతులు లేని క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేశారనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ తాత్కాలిక ఫైర్ క్రాకర్స్ దుకాణాలు దర్శనమిస్తున్నాయి.
అధికారులు చర్యలు తీసుకోవాలి ...
జీహెచ్ఎంసీ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణాలను వెంటనే మూసి వేయాలని, అనుమతులు పొందిన వారు కూడా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారా ? లేదా ? అనేది ఫైర్ విభాగం అధికారులు, స్థానిక పోలీసులు తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు . ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా, లాభార్జనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన వాటిని మూసి వేయాలని , దీపావళి సమీపంలో మరిన్ని అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు .