పండుటాకుల ప్రదక్షిణలు.. పెన్షన్ల కోసం సర్కిల్ ఆఫీసుల ఎదుట పడిగాపులు

జీహెచ్ఎంసీలో ఏళ్లతరబడి పనిచేసి, రిటైర్డు అయిన ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు ధీనంగా తయారవుతుంది.

Update: 2024-05-15 02:22 GMT

దిశ, సిటీ బ్యూరో : జీహెచ్ఎంసీలో ఏళ్లతరబడి పనిచేసి, రిటైర్డు అయిన ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు ధీనంగా తయారవుతుంది. పెన్షన్లపైనే ఆధారపడి జీవిస్తున్న రిటైర్డు ఉద్యోగులకు సకాలంలో చెల్లింపులు జరపటంలో అధికార యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే వారిని ఆఫీసుల చుట్టు తిప్పించుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నప్పటికీ, రిటైర్డు ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా చెల్లిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది. సకాలంలో ఉద్యోగులకు జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లను అందించేందుకు మూడేళ్ల నుంచి జీహెచ్ఎంసీ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (హెచ్ఆర్ఎంఎస్)ను అమలు చేసినా, సర్కిళ్ల స్థాయిలోని కొందరు సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే కొందరు ఉద్యోగుల జీతాలు, రిటైర్డు ఉద్యోగుల పెన్షన్ల బిల్లులను ఆలస్యంగా అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలిసింది.

పెన్షన్ల కోసం లంచాలు డిమాండ్..

ప్రతి నెల 21వ తేదీ కల్లా జీతాలు, పెన్షన్లకు సంబంధించిన బిల్లులను అప్‌లోడ్ చేస్తే ఒకటో తేదీ కల్లా జీతాలు, పెన్షన్లను జమ చేసేందుకు వీలవుతుందంటూ ఉన్నతాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలను సర్కిల్ స్థాయి సిబ్బంది బుట్టదాఖలు చేస్తూ రిటైర్డు ఉద్యోగులను కూడా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మెహిదీపట్నం, ఖైరతాబాద్ సర్కిళ్ల పరిధుల్లోని వందలాది మంది రిటైర్డు ఉద్యోగులకు ఇంకా పెన్షన్లు రాకపోవటంతో ఆ పండుటాకులు పెన్షన్ల కోసం బల్దియా ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పర్మినెంట్ ఉద్యోగుల జీతాల చెల్లింపులకు కాస్త ఆలసమైనా, పెన్షన్‌దారులకు ఒకటో తేదీ కల్లా పెన్షన్లు చెల్లించాలంటూ పలు యూనియన్లు కమిషనర్‌ను కోరిన నేపథ్యంలో కమిషనర్ పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి జారీచేసిన ఆదేశాలు సైతం అమలు కావటం లేదు.

ఖైరతాబాద్, మెహిదీపట్నం సర్కిళ్లలో..

ఖైరతాబాద్, మెహిదీపట్నం సర్కిళ్లకు చెందిన దాదాపు 300 మంది రిటైర్డు ఉద్యోగులకు నేటికీ పెన్షన్లు చెల్లించకపోవటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పెన్షన్‌దారుల చక్కర్లు చూడలేక కొందరు యూనియన్ నేతలు జోక్యం చేసుకుని ఖైరతాబాద్, మెహిదీపట్నం సర్కిళ్ల జీతాల బిల్లులు చేసే సిబ్బందికి ఏడాదికాలంగా చెబుతున్నా, వారు పెన్షన్‌దారులకు సకాలంలో చెల్లింపులు జరపటం లేదని ఓ యూనియన్‌కు చెందిన నేతలు తలలు పట్టుకుంటున్నారు. కనీసం తమకన్నా ముందు జీహెచ్ఎంసీకి ఏళ్లతరబడి సేవ చేసిన తమ సీనియర్, రిటైర్డు ఉద్యోగులకు సర్కిల్ ఆఫీసుల్లో కనీస గౌరవం కూడా దక్కకపోవటాన్ని పెన్షన్‌దారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

నెల మొత్తం ఎదురుచూపులు..

జీహెచ్ఎంసీలో దశాబ్దాల కాలంగా తాము చేసిన పనికి గాను తమ ఊపిరి ఉన్నంతకాలం ఎవరిపై ఆధారపడకుండా బతికేందుకు ఇచ్చే పెన్షన్ కోసం రిటైర్డు ఉద్యోగులు నెల మొత్తం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. టైమ్‌కు ఖాతాలో క్రెడిట్ కాకపోవటంతో ఆఫీసుకు వచ్చి అడిగితే సిబ్బంది చీదరించుకుంటున్నట్లు పలువురు పెన్షన్‌దారులు వాపోతున్నారు. చాలా మంది ఉద్యోగులు తాము రిటైర్డు అయ్యే సరికి తమ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తర్వాత కూడా వారి ప్రేమాభిమానాలకు నోచుకోక ఒంటరిగా జీవిస్తున్నారు. ఇలాంటి వారు తమ మెడిసిన్ కోసం, నెల మొత్తం వంటావార్పు కోసం పెన్షన్ల కోసం ఎదురుచూస్తుంటారు. మరి కొందరు తమ పిల్లల వద్దనే ఉంటున్నా, వృద్దులకు వచ్చే పెన్షన్ పైనే ఆశలు పెట్టుకున్న పిల్లలు సైతం లేకపోలేరు. టైమ్‌కు ఖాతాలో పెన్షన్లు పడకపోతే వృద్దులైన తల్లిదండ్రులను సైతం చీదరించుకునే పిల్లులు సైతం లేకపోలేరు. ఇలాంటి పెన్షన్‌దారులు నేటికీ కూడా ఖైరతాబాద్, మెహిదీపట్నం సర్కిల్ ఆఫీసుల్లో దర్శనమిస్తుంటారు. వీరి పెన్షన్ బిల్లులు చేయాల్సిన సిబ్బంది లంచాలిస్తేనే చేస్తామని భీష్మించుకోవటం, వారిపై అధికారులు వారికి వంతపాడటంతో చేసేదేమీ లేక పెన్షన్‌దారులు నీ భాంచన్ అంటూ దండాలు పెడుతున్నా, కనికరించటం లేదని తెలిసింది. సమాజ సేవ, సామాజిక స్పృహా గురించి తరుచూ మాట్లాడే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులైనా వీరిని పట్టించుకోవాలంటూ ఇంకా పెన్షన్ రాని రిటైర్డు ఉద్యోగులు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News