ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులు

వైద్యో నారాయణో హరి అన్నారు.

Update: 2024-11-25 08:01 GMT

దిశ , హైదరాబాద్ బ్యూరో : వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యున్ని నారాయణుడితో సమానమని తలుస్తారు . పోయే ప్రాణాలను అసలైన వైద్యులు నిలుపితే ఆరోగ్యంగా ఉండి చిన్న చిన్న కారణాలతో హాస్పిటల్స్, క్లినిక్ లకు వస్తున్న అమాయక ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు నకిలీ డాక్టర్లు. ఏ చిన్న జ్వరం వచ్చిన డాక్టర్ కు చూపించుకుంటే తగ్గుతుందనే నమ్మకాన్ని ప్లికేటుగాండ్లు వమ్ము చేస్తున్నారు . ఎలాంటి అర్హత లేకున్నా నకిలీ దృవపత్రాలతో బస్తీలు, కాలనీల్లో క్లినిక్ లు ఏర్పాటు చేసి అందినకాడికి దండుకుంటున్నారు . అనారోగ్యంతో వారి వద్దకు వచ్చేవారికి అవసరానికి మించి యాంటీ బయాటిక్స్‌, స్టెరాయిడ్లు, నొప్పి మాత్రలు ఇస్తుండటంతో రోగులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఈ దందా ఎక్కువైంది. కొంతమంది ఏకండా క్లీనిక్ లలో ఇన్ పేషంట్ల కోసం పడకలు సైతం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్లే అర్థం అవుతోంది .

సోషల్ మీడియాలో ప్రకటనలు...

ఎలాంటి అర్హత, డాక్టర్ చదువులు లేకుండానే కొంతమంది వైద్యులు గా చలామణి అవుతూ ఎంతోమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బస్తీలలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నాం. అధికశాతం ప్రజలకు సాధారణంగా మారిన బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాల వ్యాధులను తక్కువ ఖర్చులతో తగ్గిస్తామని సోషల్ మీడియా వేధికగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో వారు నకిలీ డాక్టర్లన్న విషయం తెలియక వైద్యం కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీరికి వైద్య పట్టాలు లేకున్నా అలోపతి ,ఆయుర్వేదం, హోమియో వైద్యం అందిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా వీరు క్లీనిక్ లు, హాస్పిటల్స్ నడుపుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఏదన్నా అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు హడావిడి చేసే అధికారులు అనంతరం పట్టించుకోకపోవడంతో నకిలీ వైద్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది .

పేద ప్రజలే టార్గెట్...

వైద్యం ఖరీదై పోవడంతో జబ్బుల భారిన పేద ప్రజలు తమ బస్తీలలో ఏర్పాటు చేసిన క్లీనిక్ అను ఆశ్రయిస్తున్నారు . ప్రైవేట్, కార్పొరేట్ హాస్సిటల్స్ కు వెళ్లే ఆర్ధిక స్థోమత లేని వీళ్లు అమాయకంగా నకిలీ వైద్యులను నమ్మి ఘోరంగా మోసపోతున్నారు. వీరు చేసే వైద్యం వల్ల రోగం తగ్గకపోగా సమస్య మరింత జఠిలంగా మారుతోంది. చివరి నిమిషంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తుండడంతో అంత మొత్తంలో డబ్బులు చెల్లించుకోలేక, జబ్బులు నయం కాక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు నగరంలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోతుండడంతో గొడవలకు దారి తీస్తున్నాయి .

దాడులు పెంచినప్పటికీ...

తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో నకిలీ డాక్టర్ గుట్టు రట్టు చేసేందుకు తెలంగాణ వైద్య మండలి ఇటీవల కాలంలో దాడులు అధికం చేసింది . ఇందులో భాగంగా ప్రతినిత్యం బస్తీలు, కాలనీలలో క్లీనిక్ లను తనిఖీ చేస్తున్నారు.రెండు రోజుల క్రితం చంపాపేట్, కర్మన్ ఘాట్, సైదాబాద్ ప్రాంతాలలోని 20 క్లినిక్ లపై అధికారులు దాడులు నిర్వహించగా 10 మంది నకిలీ వైద్యులు పట్టుబడ్డారు. వీరిపై వైద్య మండలి అధికారులు చేసిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదయ్యాయి . అయినప్పటికీ డుప్లికేట్ డాక్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నారు. కొన్ని నెలల క్రితం వరకు వైద్య మండలి అధికారుల దాడులు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా క్లినిక్ లు వెలిసాయి. వీటిని పూర్తి స్థాయిలో నియంత్రిస్తే తప్ప పేద ప్రజల ఆరోగ్యాలు మెరుగు పడవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .

జైలుకు వెళ్లడం ఖాయం…: డాక్టర్ గుండ గాని శ్రీనివాస్ ,తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్...

ఆరు నెలల వ్యవధిలో తెలంగాణలో 350 మంది, హైదరాబాద్ లో 150 వరకు నకిలీ డాక్టర్ల పై కేసులు నమోదయ్యాయి. ఎంబీబీఎస్ పట్టా ఉన్న వారు మాత్రమే అలోపతి మెడిసిన్ ఇవ్వాలి. ఇంటర్ , డిగ్రీ చదివిన వారితో పాటు బీఎంఎస్, బీహెచ్ఎంఎస్ చదివిన వారు కూడా అలోపతి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం . రాష్ట్రంలో నకిలీ వైద్యుల భారిన పడి వారానికి ఒక చావు నమోదవుతోంది. వారు ఇచ్చిన మందులు వాడి అమాయక ప్రజలు ఎన్నో రకాలుగా అస్వస్థతకు గురౌతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో సున్తీ చేయబోయి మర్మాంగాన్ని కట్ చేయడం నకిలీల పనితీరుకు పరాకాష్ట . ప్రజలు ఎలాంటి అర్హత లేని వారి వద్ద వైద్యం పొందవద్దు . క్లినిక్ ల వద్ద డాక్టర్ పేరుతో పాటు వారి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. దానిని టీఎస్ ఎంసీ ఆన్ లైన్ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ఇందులో నమోదై లేకపోతే నకిలీగా గుర్తించవచ్చు . రాబోయే రోజుల్లో నకిలీ క్లినిక్ లపై దాడులు కొనసాగిస్తాం. తెలంగాణలో ఇప్పుడు సుమారు 70 వేల మంది రిజిస్టర్ డాక్టర్లు ఉన్నారు. ఇంకా ప్రతి సంవత్సరం 63 మెడికల్ కాలేజీల్లో 10వేల మంది వరకు కొత్త డాక్టర్లు వస్తున్నారు. ప్రజలు ఎంబీబీఎస్ చదివిన వారి వద్దనే ట్రీట్ మెంట్ పొందాలి. వారికి మాత్రమే అల్లోపతి మందులు రాసే అర్హత ఉంది . బీఎంఎస్, బీహెచ్ఎంస్ చదివిన వారు వారి పరిధిలో మాత్రమే వైద్యం మాత్రమే చేయాలి. అలోపతి వైద్యం చేయడం నేరం కిందకే వస్తుంది .


Similar News