Drug officials : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ అధికారుల తనిఖీ
సికింద్రాబాద్, రైల్వే స్టేషన్ లోని మెడికల్ షాప్ లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
దిశ,సికింద్రాబాద్: సికింద్రాబాద్, రైల్వే స్టేషన్ లోని మెడికల్ షాప్ లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మెడికల్ షాపులో నిషేధిత డ్రగ్స్ గుర్తించిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆ మందులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ మేరకు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ గోవింద్ వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని 10వ నెంబర్ ప్లాట్ ఫారం వద్ద జన్ ఔషద కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మందుల షాపులపై జరుగుతున్న ఆకస్మిక తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ అధికారులు ఆదివారం రైల్వేస్టేషన్లోని జన్ఔషద్ కేంద్రంపై ఆకస్మిక దాడులు చేశారు.ఈ మెడికల్ షాప్ లో 2018లో ప్రభుత్వం నిషేధించిన ఆఫ్లాక్సాసిన్, ఆర్నిడజోల్ సస్పెన్షన్ వంటి మందులు ఉన్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు.
ప్రభుత్వం నిషేధించిన మందులను విక్రయిస్తున్న షాపు నిర్వాహకుడు రోహన్(25)ను అదుపులోకి తీసుకుని, అతనితో పాటు షాపు నిర్వా హకులపై కేసు నమోదు చేసి వివరాలను కోర్టుకు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మందులను మహారాష్ట్రలోని థానేలో లోక్–బేటా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ తయారు చేసి సరఫరా చేస్తుందని, ఈ మందుల రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్నిచూపుతున్నాయని 2018లో సెప్టెంబరు 7న ఈ మందులను కేంద్ర ప్రభుత్వం నిషేదించిందని తెలిపారు. ఈ మందులు వాడటం చాలా ప్రమాదకరకమే కాకుండా ప్రాణాంతకమైనవని ఆయన తెలిపారు. ఈ మందులు వాడటం వల్ల రోగం తగ్గడం కాదు, ఆ రోగి ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని డ్రగ్స్ఇన్ స్పెక్టర్ గోవింద్ తెలిపారు. ఈ తనిఖీల్లో మలక్పేట్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అనిల్,ముషీరాబాద్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రేణుక, బేగంపేట్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.