నిలోఫర్ లో డీఎంఈ కి ఘోర అవమానం
నిలోఫర్ లో తెలంగాణ డీఎంఈ డాక్టర్ వాణికి ఘోర అవమానం ఎదురైంది. హాస్పిటల్ తనిఖీకి వచ్చిన ఆమె కారును గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ లోనికి రాకుండా అడ్డుకున్నారు.
దిశ, హైదరాబాద్ బ్యూరో : నిలోఫర్ లో తెలంగాణ డీఎంఈ డాక్టర్ వాణికి ఘోర అవమానం ఎదురైంది. హాస్పిటల్ తనిఖీకి వచ్చిన ఆమె కారును గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ లోనికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే ... గురువారం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో సనా (13) సంవత్సరాల బాలిక అస్వస్థతకు గురైంది. దీంతో అక్కడున్న అధికారులు అంబులెన్స్ లో ఆ బాలికను చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే నిబంధనల మేరకు 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఇక్కడ వైద్యం అందించాల్సి ఉంటుంది. దీనిని అడ్డుపెట్టుకుని విధులలో ఉన్న డాక్టర్లు సదరు బాలికకు కనీసం ప్రాథమిక చికిత్స కూడా నిర్వహించకుండానే ఉస్మానియాకు తీసుకువెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు.
దీంతో గత్యంతరం లేక సదరు బాలికను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు . ఇలాంటి సంఘటననే శుక్రవారం కూడా మరొకటి చోటు చేసుకుంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మరో పదమూడేళ్ల బాలిక కూడా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురికావడంతో ఆమెను కూడా నిలోఫర్ కు తీసుకువచ్చారు. ఆమెను కూడా ఉస్మానియాకు తీసుకువెళ్లాలని సూచించిన వైద్యులు చేతులు దులుపుకున్నారు. సీఎం కార్యక్రమంలో పాల్గొన్న బాలికలు కావడంతో వారి ఆరోగ్యం గురించి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరా తీశారు.
బాలికలకు కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించకుండా ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని సూచించారని తెలుసుకుని డీఎంఈ కి ఫోన్ చేసి మందలించినట్లు తెలిసింది. దీంతో డీఎంఈ డాక్టర్ వాణి శుక్రవారం ఉదయం నిలోఫర్ ఆస్పత్రికి విచారణకు రాగా పాత భవనం రెండు గేట్లు మూసిపెట్టిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను గుర్తించకుండా అడ్డుకున్నారు. చివరకు ఆమె కారు దిగి బయటకు వచ్చి లోపల ఉన్న వారికి ఫోన్ చేయడంతో వారు బయటకు వచ్చి సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి డీఎంఈ ని లోనికి తీసుకువెళ్లారు. ఈ సంఘటనపై డీఎంఈ డాక్టర్ వాణిని ఫోన్ ద్వారా వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు...
ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలతో మళ్లీ నిలోఫర్ హాస్పిటల్ పేరు వార్తలలో నిలుస్తోంది. ఆస్పత్రిలో ఈ నెల మొదటి వారంలో నీళ్లు లేక సర్జరీలు నిలిచిపోయాయి. సంపు వద్ద ఏర్పాటు చేసిన బోరు మోటారు చెడిపోవడంతో అత్యవసర విభాగంతో పాటు ఇతర విభాగాలలో నీటి కొరత ఏర్పడింది. ఇందులో పిడియాట్రిక్ సర్జరీ, ప్రసవాల గదితో పాటు ప్రతినిత్యం సర్జరీలు జరిగే ఆపరేషన్ థియేటర్ లు ఉన్నాయి. సుమారు రెండు రోజుల పాటు నీరు అందకపోవడంతో సర్జరీలు వాయిదా పడ్డాయి. ఈ సంఘటన మరిచిపోకముందే రెండు రోజుల క్రితం అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి సహాయకులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. తాజాగా అనారోగ్యానికి గురై వచ్చిన ఇద్దరు బాలికలకు ప్రాథమిక చికిత్స కూడా అందించకుండా తిప్పిపంపడం చర్చనీయాంశంగా మారింది.
ఆదిపత్య పోరు..?
నిలోఫర్ హాస్పిటల్ లో ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్ల మధ్య ఆధిపత్య పోరుతో పాలన గాడితప్పిందనే ఆరోపణలు వినబడుతున్నాయి. హాస్పిటల్ సూపరింటెండెంట్ కుర్చీ కోసం ఇద్దరు మాజీ, తాజా సూపరింటెండెంట్ల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియ లో అప్పటి వరకు సూపరింటెండెంట్ గా ఉన్న డాక్ఱర్ ఉషారాణిని నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేయగా ఇంచార్జ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ రవికుమార్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే డాక్టర్ ఉషారాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగా తీర్పువచ్చింది.
తిరిగి వచ్చిన ఆమెకు సూపరింటెండెంట్ గా బాధ్యతలు ఇచ్చేందుకు డాక్టర్ రవికుమార్ ఇష్టపడలేదు. దీంతో ఆమె చేసేదేమీలేక ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు. ఇలా వైద్యుల మధ్య నెలకొన్న విభేదాలు రోగుల పాలిట శాపంగా మారుతోంది. మెరుగైన వైద్య సేవలు అందడం లేదనే ఆరోపణలు ఇక్కడ తరచుగా వినబడుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని నిలోఫర్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు అంతటా వినబడుతున్నాయి.