హైదరాబాద్ లో భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజురోజుకీ డెంగ్యూ కేసులు విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Update: 2024-08-03 13:32 GMT
హైదరాబాద్ లో భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజురోజుకీ డెంగ్యూ కేసులు విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పటికప్పుడు దోమల నివారణ చర్యలు, ఫాగింగ్ చేపట్టినప్పటికీ డెంగ్యూ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. జూన్ లో 91 కేసులు నమోదవ్వగా.. జూలైలో మాత్రం 290 కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్క నెలలో మూడింతల కేసులు పెరగడం, బాధితుల్లో చిన్నపిల్లలే అధికంగా ఉండటం వైద్యాధికారుల్లో కలవరం పుట్టిస్తోంది. అధికారికంగా రోజుకు 10 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని వైద్యశాఖ చెబుతున్నప్పటికీ, అనధికారికంగా రోజుకు 30 నుండి 40 వరకు ఉంటున్నట్టు సమాచారం. ఇప్పుడే ఇలా ఉంటే డెంగ్యూ సీజన్స్ గా చెప్పుకునే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగర ప్రజలు. దోమల తీవ్రత తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవేవీ ఫలితాలు ఇచ్చినట్టు కనబడటం లేదని కేసుల పెరుగుదల చూస్తే తెలుస్తోంది. ఇప్పటికైనా దోమల నివారణకు, దోమల లార్వాల నిర్మూలనకు చర్యలు చేపట్టకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 


Similar News