వాటర్ వర్క్స్‌లో ‘నల్ల కలెక్షన్స్’..! చక్రం తిప్పుతున్న జీబీ కాంట్రాక్టర్లు?

ఎండాకాలం వచ్చిందంటే చాలు నగరంలో నీటికి కటకట మొదలవుతుంది. చాలా ప్రాంతాల్లో నీళ్ల కోసం జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు.

Update: 2024-04-19 06:42 GMT

దిశ, శేరిలింగంపల్లి : ఎండాకాలం వచ్చిందంటే చాలు నగరంలో నీటికి కటకట మొదలవుతుంది. చాలా ప్రాంతాల్లో నీళ్ల కోసం జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. వాటర్ ట్యాంకర్ల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. వాటిని కూడా బుక్ చేసుకుని ఎప్పుడు వస్తాయా అని వేచి చూడక తప్పదు. దీంతో కొత్తగా ఇంటి నిర్మాణాలు చేసుకునే వారు ముందస్తుగా బోర్లు వేసుకోవడంతో పాటు నల్లా కనెక్షన్ కోసం కూడా దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఇదే అదునుగా భావిస్తున్న వాటర్ వర్స్క్ సిబ్బంది అందినకాడికి దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటర్ కనెక్షన్‌కు దరఖాస్తు వచ్చిందంటే చాలు సిబ్బంది పంటపండుతుందని, ఇక్కడే వాటర్ వర్స్క్ సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారని, అన్నీ తామై వ్యవహరిస్తూ జీబీ కాంట్రాక్టర్లతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్క్ ఇన్స్పెక్టర్లు, జీబీ కాంట్రాక్టర్ల సహాయంతో ఇదంతా చేస్తున్నారని, ఈ ఇద్దరు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

వర్క్ ఇన్స్పెక్టర్ల కనుసన్నల్లో అక్రమాలు..

హఫీజ్ పేట్ జలమండలి సెక్షన్‌లోని పలు సబ్ సెక్షన్‌లలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ల తీరుపై చాలాకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నల్లా కనెక్షన్స్ కోసం వచ్చే వినియోగదారుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని, పాత కనెక్షన్ స్థానంలో కొత్తది ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే కొత్త కనెక్షన్‌కు కూడా భారీగా దండుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వినియోగదారుల నుండి ఫీజుబిలిటి చార్జెస్ కట్టించుకున్న తదుపరి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.

అయినా ఇటీవల ఓ వర్క్ ఇన్స్పెక్టర్ ఒక ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుడి వద్ద రూ.50 వేలకు బేరం కుదుర్చుకుని ముందుగా రూ.30 వేలు తీసుకుని నల్లా కనెక్షన్ ఇచ్చారని, ఆ తర్వాత వినియోగదారుడు రూ.20 వేలు ఇవ్వక పోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అక్రమ నల్లా కనెక్షన్ల విషయంలో కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లు చేస్తున్న అక్రమాల వల్ల హెచ్ ఎండబ్ల్యూఎస్ ఆదాయానికి భారీగా గండి పడుతుందని, ఈ విషయాలు తెలిసినా డివిజనల్ మేనేజర్లు చర్యలు తీసుకునేందుకు వెనకా ముందాడుతున్నారని జలమండలిలో పనిచేసే సిబ్బందే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

జీబీ కాంట్రాక్టర్ల అత్యుత్సాహం

వినియోగదారులకు కొత్తగా నీటి కనెక్షన్లు ఇచ్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో వందలాదిమంది జీబీ కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. వీరే నీటి కనెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అధికారుల సూచనల మేరకు వీరు పనిచేయాల్సి ఉంటుంది. అయితే కొందరు కాంట్రాక్టర్లు వర్క్ ఇన్స్పెక్టర్ల అండదండలతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఇంటి పత్రాలలో ఉన్న స్థల నిర్మాణానికి అనుగుణంగా కనెక్షన్ ఇవ్వకుండా ఇల్లీగల నిర్మాణాలు ఉన్నప్పటికి వాటర్ పైప్ డయా పెంచి ఇస్తున్నారని, కొందరికి వీరే రాత్రికి రాత్రి కనెక్షన్లు ఇస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. అంతేగాక డొమెస్టిక్ కనెక్షన్ల స్థానంలో మల్టీపర్పస్ కనెక్షన్స్‌లు ఇస్తున్నారని, ఈ విషయంలో కూడా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా జీబీ కాంట్రాక్టర్లకు వర్క్ ఇన్స్పెక్టర్లు వంతపాడుతున్నారని, హఫీజ్ పేట్ పరిధిలోని పలు సెక్షన్లలో ఇలాంటివి చాలానే జరిగాయని తెలుస్తుంది.

విజిలెన్స్ అధికారులు ఎక్కడ..

దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలో జరిగే పనులకు సంబంధించి విజిలెన్స్ టీమ్ ఎప్పటికప్పుడు విచారణ చేస్తుంది. అదే మాదిరిగా జలమండలిలో కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికి ఎప్పుడో కానీ వారు జలమండలిలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి విచారణ జరిపిన దాఖలాలు దాదాపు కనబడవు. గతంలో అక్రమ నల్లా కనెక్షన్లపై ముమ్మర తనిఖీలు చేసిన విజిలెన్స్ టీమ్ తదనంతరం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. హఫీజ్ పేట్ సెక్షన్ పరిధిలో ఇంత జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు చూసీచూడనట్టు ఉండడం వెనక ఆంతర్యం ఏంటన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


అక్రమ నల్లా కనెక్షన్ల విషయంలో విజిలెన్స్ టీమ్, ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని సీపీఎం నాయకులు కొంగరి కృష్ణ డిమాండ్ చేశారు. అక్రమ నల్లా కనెక్షన్లు, సిబ్బంది తీరుపై గతంలో ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు చేశామని, అయినా అధికారులు స్పందించడం లేదని, దీన్నిబట్టి చూస్తే ఈ అక్రమాల వెనక అధికారుల హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కొంగరి కృష్ణ మండిపడ్డారు.


Similar News