సెలవుల్లోనూ క్లాసులు..ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదనే ప్రభుత్వ

Update: 2025-04-06 01:46 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదనే ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు తుంగలో తొక్కుతున్నాయి. రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యామండలి(టీజీబీఐఈ) జూన్‌ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్‌ 2న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కళాశాలలు తప్పనిసరి సెలవుల షెడ్యూల్‌ పాటించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో అనధికారికంగా తరగతులు నిర్వహిస్తే ఆ విద్యా సంస్థల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అనధికారికంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

ఇదేమిటని ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులను తరగతులకు తప్పకుండా మీ పిల్లలను పంపాల్సిందే నాని కండీషన్ పెడుతున్నట్టు సమాచారం. వేసవిలో మండుతున్న ఎండలతో ఇబ్బందులపాలవుతుండగా నిర్బంధ విద్యను అమలు చేస్తున్నాయి. ఓ వైపు గేట్లకు తాళాలు వేసి తరగతులు నిర్వహించడం, మరో వైపు ఆన్‌లైన్ క్లాసెస్ అంటూ విద్యార్థులకు సెలవులు లేకుండా చేస్తున్నాయి. ఈ విషయం ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నారాయణ, శ్రీచైతన్య, ఎక్సలెన్స్, రెసోనెన్స్, నైన్ ఎడ్యుకేషన్, ఫిట్జీ, ఎలెన్, ఫిజిక్స్ వాలా, ఆద్యా, విజేత, గాయత్రి, ఎన్ఆర్‌ఐ, ఆకాశ్ తదితర కాలేజీలు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా వేసవి తరగతులు నిర్వహిస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

హోం వర్క్ పేరుతో..

జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు జూనియర్, సీనియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయని తెలిసింది. 10వ తరగతి పరీక్షల ఫలితాలు రాకముందే టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి పిల్లలను తమ కాలేజీలో చేర్పించాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఇలా కళాశాలలో చేరిన విద్యార్థులకు జూన్ నెలలో తరగతులు నిర్వహించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా పాఠాలు చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా హోం వర్క్ పేరుతో విద్యార్థులకు రెస్ట్ లేకుండా చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు కూడా క్లాస్‌లు తీసుకుంటున్నట్టు టాక్ వినబడుతోంది. పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామంటూ యాజమాన్యలు విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ర్యాంకులే లక్ష్యంగా..

ర్యాంకులే లక్ష్యంగా కళాశాలలు వేసవి సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేసవి సెలవులు ఇస్తుంది. నగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పిల్లలు, పెద్దలు ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతుంటే కళాశాలల యాజమాన్యాలు మాత్రం నిర్బంధ తరగతులు నిర్వహిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. ఎండలతో ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని వాపోతున్నారు. ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇంటర్మీడియట్ తాజా సంవత్సరం వేసవి సెలవుల అనంతరం జూన్ 2 నుంచి తిరిగి తరగతులు మొదలు కావాల్సి ఉంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులు ఇటీవలే మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. రెండవ సంవత్సర తరగతులను పునఃప్రారంభించే ముందు విశ్రాంతి తీసుకోవడానికి, విద్యార్థులు తమను తాము రీఛార్జ్ చేసుకోవడానికి వేసవి సెలవులు ముఖ్యమైననప్పటికీ కళాశాలలు అవేమి పట్టించుకోకుండా కేవలం ర్యాంకులే టార్గెట్‌గా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సంవత్సరమంతా విరామం లేకుండా చదివే పిల్లలకు వేసవి సెలవులలో కొంత మానసిక విశ్రాంతి లభిస్తుందని, దానికి కూడా వారికి దూరం చేస్తూ క్లాసులు నిర్వహించటమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News