పది మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు

నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ లను నడుపుతున్న వారిపై తెలంగాణ వైద్య మండలి దాడులు చేపట్టారు.

Update: 2024-11-23 11:47 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ లను నడుపుతున్న వారిపై తెలంగాణ వైద్య మండలి దాడులు చేపట్టారు. ఈ మేరకు శనివారం చంపాపేట్, సైదాబాద్, కర్మన్ ఘాట్ ప్రాంతాల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డా. శ్రీనివాస్ నేతృత్వంలో డా. ఇమ్రాన్ ఆలీ, డా రాజీవ్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 20 క్లినిక్ లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ పై తనిఖీలు నిర్వహించగా 10 మంది నకిలీ వైద్యులు పట్టుబడ్డారు. ఈ పది మంది నకిలీ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ లలో ఆసుపత్రి వలె నియమాలకు విరుద్ధంగా బెడ్స్ నిర్వహించడం తో పాటు,సెలైన్స్ పెట్టడం, ఆంటీ బయోటిక్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తునట్టు గుర్తించి తగు ఆధారాలు సేకరించారు. వీరిపై ఎన్ ఎం సి యాక్ట్ 34,54 ప్రకారం కేసులు నమోదు చేయనున్నామని డా శ్రీనివాస్ తెలియ చేశారు.

మహిళ ఆయుర్వేదిక్ వైద్యురాలు రాధా కుమారి గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించడంతో పాటు నియమాలకు విరుద్ధంగా ఆలోపతి మందులు, ఆయుర్వేదిక్ వైద్యులు డా. రమేష్, డా వీరేష్ లు హై డోస్ ఆంటిబయోటిక్, స్టెరాయిడ్స్ ఇతర అల్లోపతి మందులు ఇస్తున్నట్లు గుర్తించామని, వీరిపై ఆయుష్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేయడంతో పాటు, జిల్లా ఆరోగ్య, వైద్యాధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు టీజీఎంసీ సభ్యుడు డా ఇమ్రాన్ ఆలీ తెలిపారు.

నకిలీ వైద్యులు అయిన ఆర్ ఎం పి, పిఎంపి ల పైన ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 350 వరకు కేసులు ఫైల్ చేసామని, కొన్ని ఛార్జ్ షీట్ లు కూడా ఫైల్ అయి త్వరలోనే కోర్టు కు వెళ్ళానున్నాయని, నకిలీ వైద్యుల వలన జరిగే నష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఇన్ని సంవత్సరాలుగా వీరి వలన జరిగిన, జరగబోయే నష్టాలను కోర్టు ముందు డాకుమెంట్స్ ద్వారా ఆధారాలతో సమర్పించనున్నట్లు చెప్పారు. నకిలీ వైద్య వ్యవస్థ పూర్తిస్థాయిలో పోయే విధంగా మరిన్ని చర్యలు తీసుకున్నామని టీజీఎంసీ వైస్ చైర్మన్ డా. శ్రీనివాస్ వివరించారు.


Similar News