ఎస్సీ, ఎస్టీలకు పథకాలు ఎగ్గొట్టారు: బీజేపీ ఎస్సీ జాతీయ మోర్చా ఫైర్

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలను ఎగ్గొట్టారని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ ఆరోపణలు చేశారు....

Update: 2024-12-14 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలను ఎగ్గొట్టారని, వారికి కేటాయించాల్సిన నిధులను డైవర్ట్ చేశారని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ ఆరోపణలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించిందని, బడ్జెట్ కూడా కేటాయించారు.. మరి పథకాలు ఎవరికి ఇచ్చారో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ కేవలం పేపర్లకే పరిమితమైందని చురకలంటించారు.

గత ప్రభుత్వం చేసినట్లుగానే.. కాంగ్రెస్ నిధులు డైవర్ట్ చేస్తోందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్.. దళిత, గిరిజనుల వ్యతిరేక ప్రభుత్వమని కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టళ్ల పర్యటన విద్యార్థులు మరణించాక చేపడుతున్నారని, ఇది ముందు చేసి ఉంటే మరణాలు సంభవించేవి కావని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆరంభశూరత్వంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు నరక కూపాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు మరణిస్తున్నారని, కమిటీ మొత్తం అదే ఫుడ్ తినాలని ప్రభుత్వం చెబుతోందని, మరి ఆ కమిటీకి ఎందుకు ఫుడ్ పాయిజన్ అవ్వలేదని, దీన్నిబట్టి ఆ కమిటీ కూడా పాఠశాలల్లో ఫుడ్ తినడం లేదని అర్థం చేసుకోవచ్చన్నారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, కానీ 10 మందిని మాత్రమే పంపించి మోసం చేస్తున్నారన్నారు.

గిరిజనులకు బేడీలు వేయడం స్వేచ్ఛ అందించినట్లవుతుందా? అని కుమార్ ప్రశ్నించారు. చిన్న పరిశ్రమలకు 600 కోట్లు రిలీజ్ చేశారని, కానీ ఒక్క చెక్ కూడా పాసవ్వలేదని ఫైరయ్యారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీకి సంబంధించిన 6వేల ఫైళ్లు పెండింగులో ఉన్నాయని, వారికి భరోసా కల్పించేందుకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తోందన్నారు. వాటిని కూడా డైవర్ట్ చేశారన్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కు సంబంధించిన ఫండ్స్ డైవర్ట్ పై కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి, సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్లు కుమార్ తెలిపారు.


Similar News