ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. ఆర్ఓటి.వెంకన్న
రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చార్మినార్ శాసనసభ నియోజకవర్గం - (66) పరిధిలోని 202 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు.
దిశ, చార్మినార్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చార్మినార్ శాసనసభ నియోజకవర్గం - (66) పరిధిలోని 202 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలోని డీఆర్సీ కేంద్రంలో పోలింగ్ ఏర్పాట్లు వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకన్న వివరించారు. చార్మినార్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 226117 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు - 1,18,272, మహిళలు - 1,07,815, థర్డ్ జెండర్ - 30 మంది ఉన్నారని తెలిపారు. 91 భవనాల్లో 202 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 133 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. అన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘాతో భద్రతా చర్యలు చేపట్టామన్నారు.
డీఆర్సీ కేంద్రం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ప్రెసిడింగ్ ఆఫీసర్లు అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్లతో పాటు మైక్రో అబ్జర్వర్లను నియమించి మొత్తం 1,050 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్రాలకు తరలించామన్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఓటర్లు అందరికి సిబ్బందితో ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశామన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటర్ల ను చైతన్య పరిచామన్నారు. 100% శాతం పోలింగ్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నోడల్ అధికారి పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లో సి- విజిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఎన్నికలకు సంబంధించి ఏవైనా అక్రమాలు, సమస్యలు తలెత్తితే అందులో ఫిర్యాదు చేయాలని సూచించారు.