కరప్షన్ పై ఏసీబీ పంజా...లంచం అడిగిన 27 మంది కి జైలు
అవినీతి అధికారుల భరతం పట్టేందుకు సామాన్యుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు.
దిశ, సిటీక్రైం : అవినీతి అధికారుల భరతం పట్టేందుకు సామాన్యుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. చట్టప్రకారం, నిబంధనలకు మేరకు తనకు జరగాల్సిన పనులకు లంచం డిమాండ్ తో వేధిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పై కామన్ మ్యాన్ కన్నెర్ర చేశాడు. దీనికి అవినీతి నిరోధక శాఖ తోడయ్యి అక్రమార్కుల ఆటకట్టించేందుకు అండగా నిలబడడంతో నవంబరు నెలలో మొత్తం 27 మంది లంచావతారాలను జైలుకు పంపారు. బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు 27 మంది ప్రభుత్వ అధికారులతో పాటు ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను లంచం ను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో పంచాయితీ రాజ్, విద్యాశాఖ, పోలీసు, మున్సిపల్, టీజీపీడీసీఎల్, రెవెన్యూ, జిహెచ్ఎమ్ సి, కమర్షియల్ ట్యాక్స్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్ శాఖలకు చెందిన వారు ఉన్నట్లు ఏసీబీ అధికారు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ 27 మంది నుంచి 3.54 లక్షల లంచం డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరో సంచలన కేసులో ఇరిగేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ 17.73 కోట్ల అక్రమాస్తుల చిట్టాను ఆధారాలతో బయటపెట్టారు. ఈ లంచాలకు సంబంధించిన కేసులలో పకడ్బందిగా దర్యాప్తు, విచారణలో కోర్టు ముందు అన్ని సాక్ష్యాధారాలను నిరూపించి ముగ్గురు అవినీతి అధికారులకు కోర్టు జైలు శిక్షలు ఖరారు చేసేలా పని చేశారు. 2013 లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిలగం వెంకటేశ్వరరావు కు ఏడాది జైలు, 20 వేల జరిమానా, తొగూరి పోచయ్య డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 2013 లో లంచం తీసుకుంటు దొరికాడు 3 ఏండ్ల జైలు, 3 వేల జరిమానా, పి. అశొక్ ఏఈ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2012 లో లంచం డబ్బులను జేబులో వేసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు 2 ఏండ్లు జైలు , 20 వేల జరిమానా ల శిక్షలు వేస్తు కోర్టు తీర్పును ఇచ్చింది. ఎవరైనా లంచం అడిగితే బాధితులు ఏలాంటి అనుమానాలు లేకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, సోషల్ మీడియా ఎక్స్, ఫేసుబుక్ లలో @telanganACB కి ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ కోరారు.