ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో రెండు పార్లమెంట్ నియోజక వర్గాల్లో పోటీ
రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పొటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు.
దిశ, ముషీరాబాద్: రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పొటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఆదివారం డాక్టర్ దిడ్డి సుధాకర్ అధ్యక్షతన ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీకి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణా కమిటీ సిద్ధంగా ఉందని కేంద్ర పార్టీ భాద్యులకి తెలియ చేయడం జరిగిందన్నారు. ఇండియా అలయన్స్‌లో ఆ నియోజకవర్గాలను కేటాయిస్తే పోటీ చేస్తామని చెప్పారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెంకట రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి సుధా కిరణ్ పోటీ చేసి గణనీయమైన ఓట్లను సాధించడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ, మిగిలిన అలయన్స్ పార్టీలతో కలిసి పోటీ చేసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నిలువరిస్తామని డాక్టర్ సుధాకర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఈడి, సిబిఐలతో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే ఇండియా కూటమి దెబ్బ తింటుందని మోడీ కలలు కంటున్నారన్నారు. కానీ మోడీ కలలు కల్లలు అవుతాయని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని డాక్టర్ సుధాకర్ ధీమా వ్యక్తం చేశారు.