Sardar Sarvayi Papanna : వెన్నుచూపని వీరుడు... సర్దార్ సర్వాయి పాపన్న
వెన్నుచూపని వీరుడు, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.
దిశ, చందానగర్ : వెన్నుచూపని వీరుడు, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తాలో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ సుమారు 350 ఏళ్ల క్రితం ఆనాటి మొగల్ పాలకుల దౌర్జన్యాలకు , నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ తిరుగుబాటు చేసి 33 కోటలను జయించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేశారని తెలిపారు. గోల్కొండ కోటను 6 నెలల పాటు పాలించిన గొప్ప బహుజన వీరులు అని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి లను అధికారికంగా నిర్వహించడంతోపాటు చారిత్రక ట్యాంక్ బండ్ పై 3 కోట్లతో వారి విగ్రహాన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు మతాలకు వృత్తుల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కల్లు దుకాణాలను రద్దుచేసి గౌడ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో తాటి చెట్లను నాటుతున్నామన్నారు. కల్లుకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ్ల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వీటితోపాటు వైన్ షాప్ లలో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. కార్య క్రమంలో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు,ఆయా పార్టీల నాయకులు బండి రమేష్,కొండా విశ్వేశర రెడ్డి, రఘునాథ్ యాదవ్, రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన గౌడ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.