కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ డెవలప్: డిప్యూటీ CM భట్టి

హైదరాబాద్‌ను మహానగరంగా రూపొందించడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలదే ప్రధాన భూమిక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Update: 2024-03-10 16:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ను మహానగరంగా రూపొందించడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలదే ప్రధాన భూమిక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన క్రేడయ్ ప్రాపర్టీ షో ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాదులో బీహెచ్ఇఎల్, బీడీఎల్, ఈసీఐల్, డీఆర్డీఓ వంటి కేంద్ర సంస్థలు హైదరాబాద్‌కు తరలివచ్చాయన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌ను మణిహారంగా భావించే ఔటర్ రింగ్ రోడ్డు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే నిర్మాణం జరిగిందన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పునాదులు పడ్డాయి అన్నారు.

కాంగ్రెస్ పాలకుల దూర దృష్టితోనే హైదరాబాద్ విస్తరించిందని గుర్తు చేశారు. ఫలితంగానే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దిన దినాభివృద్ధి చెందిందన్నారు. గత పదేళ్ల పాలకులు హైదరాబాద్కు చేసింది ఏమీ లేదన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని, నాగార్జునసాగర్ నుంచి కృష్ణ నీటిని, మంజీరా, గండిపేట నీటిని నగరవాసుల కోసం అందుబాటులోకి తెచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని అన్నారు. ఇప్పుడు సుంకిశాల నిర్మాణం పూర్తి చేసి అదనపు కృష్ణా జలాలను మహానగరానికి తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు అందరికీ అందుబాటులో ఉన్నదన్నారు.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర అభివృద్ధికి క్యాబినెట్ తీవ్రంగా శ్రమిస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రీజనల్ రింగ్ రోడ్డుకు భూమి కేటాయించడం నిధులు కేటాయించడం వంటివి పూర్తి చేశామన్నారు. మూడు నెలల కాలంలోనే కేంద్రంతో మాట్లాడి ఎలివేటెడ్ కారిడార్ పనులకు పునాదులు వేశామన్నారు. డిఫెన్స్ రంగం నుంచి భూములు తీసుకొని ప్రత్యామ్నంగా భూములు కేటాయించి సమస్యను పరిష్కరించామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు వివరించారు. ఈ రెండు రహదారుల మధ్య ఇండస్ట్రీయల్ క్లస్టర్లు నిర్మించనున్నట్టు తెలిపారు.

లండన్ థేమ్స్ మాదిరిగా..

లండన్‌లో థేమ్స్ నది మాదిరిగా మూసీ నదిని సుందరీకరణ చేసి దాని పరివాహక ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లాంటి నగరం ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా ఉండదన్నారు. ఇక్కడ గ్రామీణ, నగర వాతావరణం కలిసి ఉంటాయన్నారు. అందుకే అద్బుతమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్‌లో నిర్మించనున్న క్లస్టర్లు ద్వారా అభివృద్ధిలో జిల్లాలను కలుపుతామన్నారు. నాలుగు రోజుల ప్రాపర్టీ షోలో మంచి స్పందన వచ్చిందని తెలిపారు.

భద్రత, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, మంచినీళ్లు, ఉపాధి అవకాశాలు హైదరాబాదులో పుష్కలంగా ఉన్నాయన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. క్రేడయ్ అందించే సలహాలు సూచనలు స్వీకరిస్తామన్నారు. ప్రజలు, రాష్ట్ర అభివృద్దికి పాల్పడే వ్యక్తుల కోసం తమ ప్రభుత్వ ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల ద్వారా పనుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. తద్వారా జీడీపీ పెరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.


Similar News