ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.. హైదరాబాద్ సీపీ ​సీ.వీ.ఆనంద్​

శారీరకంగా ఫిట్ గా ఉన్నపుడే శాంతిభద్రతల పరిరక్షణలో మరింత మెరుగైన పాత్రను పోషించగలమని హైదరాబాద్ ​పోలీస్ ​కమిషనర్​ సీ.వీ.ఆనంద్​ చెప్పారు.

Update: 2023-05-07 14:52 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: శారీరకంగా ఫిట్ గా ఉన్నపుడే శాంతిభద్రతల పరిరక్షణలో మరింత మెరుగైన పాత్రను పోషించగలమని హైదరాబాద్ ​పోలీస్ ​కమిషనర్​ సీ.వీ.ఆనంద్​ చెప్పారు. వ్యాయామం చేయటంతోపాటు సరైన న్యూట్రీషన్ ​ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చన్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో స్వచ్ఛంధ సంస్థ హెల్పింగ్​ హ్యాండ్ ​ఫౌండేషన్​తో కలిసి కొంతకాలం క్రితం ఫిట్ ​కాప్​ యాప్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా హైదరాబాద్​ కమిషనరేట్​లోని పదహారు వేల మంది సిబ్బందికి హెల్పింగ్​ హ్యాండ్​ ఫౌండేషన్ ​ప్రతినిధులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఊబకాయంతో ఉన్నవారితో పాటు వేర్వేరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సిబ్బందిని గుర్తించారు. ఊబకాయం తగ్గించుకోవటంతో పాటు ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చేయాల్సిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన డైట్​గురించి హెల్పింగ్​ హ్యాండ్​ ఫౌండేషన్​ ప్రతినిధులు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎప్పటికప్పడు సలహాలు ఇస్తూ వచ్చారు. ఇది సత్ఫలితాలను ఇస్తున్నట్టు కమిషనర్​ సీ.వీ.ఆనంద్​ చెప్పారు.

హెల్పింగ్ ​హ్యాండ్స్​ ఫౌండేషన్​ ప్రతినిధుల సూచనలతో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఊబకాయం సమస్య నుంచి బయటపడినట్టు వివరించారు. సిబ్బంది వారి వారి కుటుంబసభ్యులకు కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పంచుకోవాలన్నారు. తద్వారా సిబ్బంది కుటుంబాల సభ్యులు కూడా ఫిజికల్​గా ఫిట్​గా ఉంటారని చెప్పారు. వీలైనపుడల్లా కాలినడకన ప్యాట్రోలింగ్​ చేయాలని కమిషనర్​సూచించారు. దీనివల్ల ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయని వివరించారు. హెల్పింగ్​హ్యాండ్స్​ఫౌండేషన్​ జరిపిన పరీక్షల్లో అరవైమంది సిబ్బంది ఆరోగ్య రీత్యా హైరిస్క్​లో ఉన్నట్టుగా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అయితే, ఇచ్చిన సూచనలను పాటించిన వీళ్లంతా సమస్యల నుంచి బయటపడినట్టు చెప్పారన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్​హ్యాండ్స్​ప్రతినిధులు ఇచ్చిన సలహాలతో సమస్యల నుంచి బయటపడ్డ కొంతమంది సిబ్బంది తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో జాయింట్​కమిషనర్​ (కో–ఆర్డినేషన్) గజరావు భూపాల్, ఐసీసీసీ డీసీపీ సునీతారెడ్డి, హెల్పింగ్​ హ్యాండ్స్​ ఫౌండేషన్​ టీం హెడ్ ​ముజ్తబా తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News