హైడ్రా దెబ్బతో కొత్త డౌట్.. ప్రాపర్టీ లేనప్పుడు లోన్స్ రికవరీ ఎలా..?

నీటి పారుదలశాఖ అధికారులు ఎన్వోసీలు ఇచ్చారు. వీటి నిర్మాణానికి సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. వినియోగదారులూ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఫ్లాట్లు బుక్ చేస్తున్నారు.

Update: 2024-09-25 02:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: లేక్ వ్యూ, రివర్ వ్యూ పేరిట హైదరాబాద్, చుట్టు పక్కల అపార్ట్ మెంట్లు, విల్లాలు, ఇండ్లు నిర్మించారు. అన్ని పరిశీలించిన తర్వాతే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు వీటికి అనుమతులు జారీ చేశారు. నీటి పారుదలశాఖ అధికారులు ఎన్వోసీలు ఇచ్చారు. వీటి నిర్మాణానికి సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. వినియోగదారులూ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఫ్లాట్లు బుక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇవి ఉన్నాయంటూ హైడ్రా ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నది. ఈ నేపథ్యంలో.. అక్కడ ప్రాపర్టీయే లేనప్పుడు సంస్థలు, వ్యక్తుల నుంచి రుణాల రికవరీ ఎల్ఐసీ హౌజింగ్ వంటి ఫైనాన్షియల్ సంస్థలకు, జాతీయ బ్యాంకులకు సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొనుగోలు చేసిన వారిలో ఆందోళన

హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన కనిపిస్తున్నది. సొంతగా కూడగట్టుకున్న డబ్బుతోపాటు బ్యాంకు నుంచి తీసుకున్న రుణమూ పోయిందని చాలా మంది వాపోతున్నారు. రుణాలు కట్టకుంటే సిబిల్ స్కోర్ సైతం పడిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయంటే రూ.కోట్లు పెట్టి ఫ్లాట్స్ బుక్ చేసుకున్నామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైడ్రా అనేక ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు, విల్లాలను కూల్చివేసింది. వాటికి అడ్వాన్సులు ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తమ డబ్బులు పోతాయా? వస్తాయా? అంటూ ఆరా తీస్తున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదిస్తున్నారు. ఇంకొందరేమో సైట్ దగ్గరికి వెళ్లి, డెవలపర్స్ ఆఫీసులకు వెళ్లి ప్రశ్నిస్తున్నారు.

ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే: బ్యాంకులు

‘హోమ్ లోన్స్ విషయంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం అన్నింటినీ వెరిఫై చేస్తారు. ప్రతి క్లయింట్ ఫైల్ ని నిశితంగా పరిశీలిస్తారు. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. ఆర్బీఐ నిబంధనల మేరకు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులు ఉంటేనే లోన్లు ఇస్తారు’ అని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కస్టమర్ల కంటే ముందు డెవలపర్లు లోన్ తీసుకుంటారని, దీంతో ఆ ప్రాజెక్టుకు అనుమతులు దక్కినట్లుగా రికార్డులు ఉంటాయని పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణాలైతే రూ.వందల కోట్ల రుణం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రాపర్టీని మార్ట్ గేజ్ చేసుకున్న తర్వాతే లోన్ సాంక్షన్ అవుతుందని, లోన్ ఇచ్చేటప్పుడు డూస్, డోంట్ డూస్ అనే చార్ట్ ఉంటుందని, దాని ప్రకారమే ముందుకెళ్తామంటున్నారు. టైటిల్ ట్రాన్స్ ఫర్ అవుతుందంటేనే లీగల్ కదా.. అలాంటప్పుడు బ్యాంకుల తప్పు ఎలా అవుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ బీఎస్ రాంబాబు ‘దిశ’తో అన్నారు.

ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధి ఎలా తెలుస్తుంది?

ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మిస్తున్నారని తమకెలా తెలుస్తుందని బ్యాంకులు ప్రశ్నిస్తున్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెరా వంటి సంస్థల అనుమతులు చూసిన తర్వాతే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. బ్యాంకుల మధ్య నిబంధనల్లో కాస్త తేడాలు ఉండొచ్చు. ఏ బ్యాంకైనా అనుమతులు ఉన్నాయా? లేవా? అన్నదే ప్రధానంగా చూస్తుంది. ఉదాహారణకు మల్లంపేట విల్లాలకు ఎల్ఐసీ హౌజింగ్ లోన్స్ అప్రూవ్ చేసింది. కొన్ని బ్యాంకులేమో రిజెక్ట్ చేశాయి. ఒక్కో బ్యాంకుకు ఒక్కో వెసులుబాటు ఉంటుంది. అయితే అధికారులు జారీ చేసిన అనుమతులు చెల్లవని హైడ్రా చెబితే బాధ్యత ఎవరిదని బ్యాంకులు ప్రశ్నిస్తున్నాయి.

రుణాల రికవరీ ఎలా?

లోన్లు తీసుకున్న ఏ క్లయింట్ కూడా తన ఇంటిని కూల్చేస్తే ఈఎంఐ కట్టే పరిస్థితి ఉండదు. బ్యాంకులు కూడా ఆక్షన్ పెట్టి సొమ్మును రికవరీ చేసే అవకాశముండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారుల సూచన మేరకు తాము పని చేయాల్సి ఉంటుందని, కోర్టుకు వెళ్లడం అనివార్యమని మేనేజర్ స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. అన్ని రకాల అనుమతులు ఉంటేనే లోన్లు తీసుకొని కొనుగోలు చేశామని, హైడ్రా కూల్చేస్తే తామేం చేయాలని కస్టమర్లు రిప్లయ్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఇక కోర్టు ఆదేశాలే కీలకంగా మారనున్నాయి. కస్టమర్ వాయిదాలు చెల్లించకపోతే ఏం చేయాలో తెలుసని, కానీ నిరాశ్రయుడైతే ఏ పద్ధతిని అనుసరించాలన్న గైడ్ లైన్స్ తమ దగ్గర లేవని ఓ బ్యాంక్ ఉద్యోగి జగన్ అభిప్రాయపడ్డారు.

టైటిల్ ట్రాన్స్ ఫర్ అనేదే ప్రామాణికం - బీఎస్ రాంబాబు, కార్యదర్శి, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్

హోమ్ లోన్స్ జారీలో బ్యాంకుల తప్పు ఉండదు. అన్ని నిబంధనలు పాటిస్తారు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయా? టైటిల్ ట్రాన్స్ ఫర్ అవుతుందా? పరిశీలించి, లీగల్ ఒపీనియన్ తీసుకొని బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. అనుమతులు తీసుకున్న తర్వాతే డెవలపర్స్ కూడా పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటారు. ఆ తర్వాత కస్టమర్లు కూడా పొందుతారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ని గుర్తించే మెకానిజం, టెక్నికల్ నాలెడ్జ్ బ్యాంక్ ఎంపాయీస్ కి ఉండదు. అయితే ప్రభుత్వ ఇచ్చిన అనుమతులు ఇప్పుడు చెల్లవని అంటే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలే బాధ్యత వహించాలి. ఏయే బ్యాంకులు ఎంత వరకు లోన్లు ఇచ్చాయన్నది లెక్క తేలలేదు. ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఎవరిది తప్పు? ఎవరు బాధ్యులు? అనేది కోర్టు తేలుస్తుంది.

కస్టమర్ మీద ఒత్తిడి కుదరదు -డి.లోకేశ్, డిప్యూటీ మేనేజర్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్

ఏ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ అయినా అనుమతులు చూసిన తర్వాతే లోన్స్ ఇస్తాయి. కస్టమర్లు ఈఎంఐలు చెల్లించకపోతే ఎన్ పీఏలుగా మిగిలిపోతాయి. అయితే ఎగనిస్ట్ లోన్ మీద ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే రికవరీకి కొంత అవకాశం ఉంటుంది. అది కూడా సవాలక్ష ఆంక్షలతో కూడినదే. మొత్తం లోన్ రికవరీ కాకపోయినా 50 నుంచి 70 శాతం వరకు రావచ్చు. ఇల్లే లేనప్పుడు ఏ కస్టమర్ ఈఎంఐ కట్టడు. ఆక్షన్ వేయడానికి కూడా అక్కడ ప్రాపర్టే లేనప్పుడు ఇక ఎన్ పీఏగానే భావించాల్సి ఉంటుంది. అప్పటికే కస్టమర్ తన సొంత డబ్బు కూడా లాస్ అయి ఉంటాడు. ఇక బ్యాంకు లోన్ మీద ఒత్తిడి సాధ్యం కాదు. లీగల్ గా ప్రోసీడ్ కావడం తప్ప మరో మార్గమేదీ ఉండదు.


Similar News