Hot News: తప్పు మాది కాదు.. రాష్ట్రానిదే! తాజా స్టేటస్‌పై స్టేట్ నుంచి నో రిపోర్ట్

వరద సహాయక చర్యలకు వాడుకోవాల్సిన తక్షణ నిధులపై కేంద్రానికి సీఎం రేవంత్‌‌రెడ్డి చేసిన విజ్ఞప్తి రాజకీయ రంగు పులుముకుంది.

Update: 2024-09-05 02:32 GMT
Hot News: తప్పు మాది కాదు.. రాష్ట్రానిదే! తాజా స్టేటస్‌పై స్టేట్ నుంచి నో రిపోర్ట్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: వరద సహాయక చర్యలకు వాడుకోవాల్సిన తక్షణ నిధులపై కేంద్రానికి సీఎం రేవంత్‌‌రెడ్డి చేసిన విజ్ఞప్తి రాజకీయ రంగు పులుముకుంది. సుమారు రూ.5,348 కోట్ల మేర నష్టం జరిగిందన్న ప్రాథమిక అంచనా వివరాలను వెల్లడించిన సీఎం రేవంత్.. కేంద్రం వెంటనే సాయం అందజేయాలని మీడియా ద్వారా కోరారు. మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కేంద్ర హోం మంత్రికి లేఖ రాసినట్లు ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ సైతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాసింది. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) నిధులను కోరుతూ.. రాష్ట్రం నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి లేఖ రాలేదని కేంద్ర హోంశాఖలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వింగ్ డైరెక్టర్ ఆశిష్ గవాయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

వరదల తాజా పరిస్థితిపైనా లేటెస్ట్ సిచ్యువేషన్ రిపోర్టును పంపలేదన్నారు. రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నష్టం సంభవించిందని, సహాయక చర్యల కోసం కేంద్రం తరఫున ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. హకీంపేటలో రెండు ఆర్మీ హెలికాప్టర్‌లను కూడా ఉంచినట్లు గుర్తు చేశారు. సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం తగిన చొరవ తీసుకున్నదని వివరించారు. రాష్ట్రంలోని వరద పరిస్థితిపై స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్ఈఓసీ) నుంచి తమకు టెలిఫోన్ ద్వారా సమాచారం అందిందని, ఏ మేరకు నష్టం జరిగిందనే వివరాలు వచ్చాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్‌కు ఎలాంటి రిపోర్టు రాలేదని నొక్కి చెప్పారు. నిబంధనల ప్రకారం రాష్ట్రం నుంచి రాతపూర్వకంగా పూర్తి వివరాలతో నివేదిక అందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఎస్డీఆర్ఎఫ్ నిధులు

ఎస్డీఆర్ఎఫ్ నిధుల గురించి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ఆశిష్ గవాయ్ ఆ లేఖలో ప్రస్తావిస్తూ... తెలంగాణ దగ్గర రూ. 1,345.15 కోట్లు సిద్ధంగా ఉన్నాయని, ఏప్రిల్ 1 నాటికి అకౌంట్‌లో ఈ నిల్వలు ఉన్నట్లు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ నివేదికలో పేర్కొన్నారని గుర్తుచేశారు. వరదల లాంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ ఖాతాలోంచి నిధులను వాడుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో కేంద్రం తన వాటాగా ఫండ్స్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు తమకు రిక్వెస్టు రాలేదని గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్, అక్టోబరు నెలల్లో ఎస్డీఆర్ఎఫ్‌ నిధులకు సంబంధించి గతంలో విడుదలైనవి, వాటిని ఖర్చు చేసినవి, ఇంకా మిగిలి ఉన్నవి, అదనంగా ఖర్చయినవి, ఇలాంటి వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడం రొటీన్ ప్రాక్టీస్ అని వివరించారు.

ఇప్పటివరకు ఖర్చయినది, ఇంకా బ్యాలెన్సు ఉన్నది ఆ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొన్న ఆయన సంబంధిత ప్రొఫార్మా ఫార్మాట్‌ను కూడా ఆ లేఖతో జతపరిచారు. కేంద్రం ఎప్పటికప్పుడు తన వాటాను రాష్ట్రానికి జమ చేస్తూనే ఉన్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాత్రం ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల చేయాల్సి ఉన్నదన్నారు. గత ప్రభుత్వంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ. 188.80 కోట్లను 2023 జూలై 10న జమ చేసిందని గుర్తుచేశారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఫస్ట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ వాటాలను ఈ సంవత్సరం మార్చి 13, 28 తేదీల్లో రూ. 198 కోట్ల చొప్పున విడుదల చేసిందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రూ. 208.40 కోట్లను ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రిలీజ్ చేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు.

యూసీలు ఇవ్వకపోవడంతో..

కేంద్ర వాటా విడుదలపై రాష్ట్రం నుంచి ఎలాంటి రిక్వెస్టు రాకపోవడంతోపాటు గతేడాది ఇచ్చిన నిధుల వినియోగానికి సంబంధించి ఎలాంటి యుటిలైజేషన్ సర్టిఫికెట్‌ (యూసీ)ను కేంద్రానికి ఇవ్వలేదని ఆశిష్ గవాయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో విడుదలైన నిధుల్లో ఎన్ని ఖర్చయ్యాయి, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి, బ్యాంకు ఖాతాలో వాటిపై వచ్చిన వడ్డీ ఆదాయమెంత, ఇలాంటివన్నీ యూసీలో పేర్కొనాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ యూసీని తమకు అందజేయడంతోపాటు ఒక కాపీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఎక్స్ పెండిచర్ విభాగానికి కూడా పంపాలని తాజా లేఖలో సూచించారు. అది రాగానే నిధులను విడుదల చేస్తామన్నారు. మరోవైపు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ అధికారులు రోజువారీ సిచ్యువేషన్ రిపోర్టును క్రమం తప్పకుండా పంపాలని పేర్కొన్నారు.


Similar News