ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దు.. చిరంజీవికి హైకోర్టు ఆదేశం
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొదని మెగాస్టార్ చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది.
దిశ, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొదని మెగాస్టార్ చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది. వివాదాస్పద భూమిపై యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి విక్రయించిందంటూ జె.శ్రీకాంత్ బాబు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. 595 చదరపు గజాల అమ్మకాలకు సంబంధించిన సొసైటీ మేనేజింగ్ కమిటీ, వార్షిక సర్వసభ్య సమావేశం ఆమోదం చెప్పిన రికార్డులను తెప్పించుకొని పరిశీలించాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) భూమిని స్వాధీనం చేసుకోనందున, సొసైటీ నిబంధనలను ఉల్లంఘించి మెగాస్టార్ చిరంజీవికి భూమిని విక్రయించిందని పిటిషనర్ వాదించారు. చిరంజీవి ఆ స్థలంలో నిర్మాణ కార్యకలాపాలు చేపట్టినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న కోర్టు కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీ, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలను ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.