హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటల్లో భారీ వర్షం
నగరంలో మంగళవారం ఉదయం కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: నగరంలో మంగళవారం ఉదయం కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, మదాపూర్ ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకు భారీ వర్షం కురిసింది. దీంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దాదాపు రెండు గంటల నుంచి మోస్తారు వర్షం కురుస్తూనే ఉంది. ఈ సమయంలో వాతావరణ శాఖ హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్ ప్రకటించింది. మరో రెండు గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురువనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే లోతట్టు ప్రాంతాలకు సిబ్బంది వెళ్లాలని ఎక్కడ నీరు నిల్వ కుండ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా హైదరాబాద్ తో పాటు, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సిరిసిల్ల, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో మరికొద్ది సేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.