రెడ్ జోన్‌లో 9, ఆరెంజ్ జోన్‌లో 12 జిల్లాలు.. క్లౌడ్ బరస్ట్‌కు అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-08-31 16:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన భారతీయ వాతావరణ కేంద్రం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో పాటు వీటిని రెడ్ జోన్‌లో చేర్చింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించి ఆరెంజ్ జోన్‌లో పెట్టింది. వాయుగుండం 36 గంటల తర్వాత (సోమవారం మధ్యాహ్నం) తీరం దాటవచ్చని అంచనా వేసి ఆ తర్వాత రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.

వాయుగుండం కారణంగా శనివారం ఎనిమిది జిల్లాలకు (కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ) రెడ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగానే మంత్రి సీతక్క తొలుత ములుగు జిల్లా పర్యటనకు షెడ్యూలు ఖరారైనప్పటికీ ఆ తర్వాత వర్షాలు, వరదల కారణంగా టూర్‌ను రద్దు చేసుకున్నారు. అతి భారీ వర్షాలతో మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల పరిస్థితిని అంచనా వేసిన డిప్యూటీ సీఎం రామగుండం పర్యటనను అర్ధంతరంగా వాయిదా వేసుకుని అక్కడికి వెళ్ళారు. వాయుగుండం ఎఫెక్టుతో తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్షం కురుస్తుండడంతో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మరోవైపు గోదావరి, కృష్ణా బేసిన్‌లలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లలోకి ఇన్‌ప్లో పెరగడం, రాష్ట్రంలోని వర్షాలతో వరద వస్తుండడంతో అన్ని ప్రాజెక్టులపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ అధికారులతో రివ్యూ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఏ స్థాయి సిబ్బంది కూడా హెడ్ క్వార్టర్‌ను వదిలి వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఇరిగేషన్ డిపార్టుమెంటులో సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంజినీర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, చెరువుల నీటిమట్టాలను పర్యవేక్షించాలని, గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని, ఓవర్ ఫ్లో లాంటి పరిస్థితులను ఎదుర్కోడానికి గేట్లు, స్పిల్ వేలను పరిశీలించాలన్నారు. డ్యామ్‌లు, కట్టలు, కెనాళ్ళను తనిఖీ చేయాలని, ప్రమాదం పొంచి ఉన్నదనే అనుమానం వస్తే అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని, స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం లో ఉంటూ తదనుగుణమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

క్లౌడ్ బరస్ట్ అవకాశాలపై అలర్ట్..

రాష్ట్రంలోనే కాక సరిహద్దు ప్రాంతాల్లోను భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా, అత్యవసర పరిస్థితి తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చినందున కలెక్టర్ కార్యాలయంతోపాటు జీహెచ్ఎంసీ, సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లోతట్టు, వరద ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎస్... ఉధృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలన్నారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడకు తరలించేలా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.

భారీ వర్షాలు, వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ప్రసార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేర వేయాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, ఏ విధమైన అవసరమైతే జిల్లా అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వాలని, అదనపు ఫోర్స్ పంపిస్తామని భరోసా కల్పించారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులకు గండ్లు పడకుండా, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా, ఉద్దేశపూర్వకంగా ప్రజలు గండ్లు పెట్టే అవకాశాలను కూడా నిరోధించాలని ఇరిగేషన్ అధికారులను అలర్ట్ చేశారు. పోలీస్, నీటిపారుదల, విపత్తుల నిర్వహణ, పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీలో ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు, మాన్ హోల్‌లను తెరవకుండా నిఘా ఉంచాలన్నారు.

సూర్యాపేట జిల్లాలోని లక్కవరం (హుజూర్‌నగర్ మండలం)లో శనివారం ఉదయం మొదలు రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా 25 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా అదే జిల్లాలోని చిలుకూరులో 23.3 సెం మీ., ములుగు, ఖమ్మం, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లోనూ 13 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దాదాపు 80 చోట్ల అతి భారీ వర్షాలు కురిశాయని, పన్నెండు గంటల వ్యవధిలో 6.5 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనట్లు హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సిటీ లో కూడా భారీ వర్షాలు నమోదు కావడంతో పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడం తో పాటు ప్రధాన రహదారులపైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం, సోమవారం సైతం వర్షాలు విస్తృతంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అన్ని జాగ్రత్తలనూ తీసుకున్నది.

సోమవారం స్కూళ్ళకు సెలవు

వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో శనివారం కురిసిన వర్షం, ఆదివారం కురిసే అవకాశాలు, రెండు రోజుల పాటు వాతావరణ కేంద్రం ఇచ్చిన ఆరెంజ్, రెడ్ అలర్టులను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ రివ్యూ నిర్వహించిన సందర్భంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంపై అక్కడిక్కడే నిర్ణయం తీసుకోవాలని సూచించినా వాతావరణ కేంద్రం హెచ్చరికలతో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది. పురపాలక, విద్యుత్ శాఖలు సైతం వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

సీఎస్, డీజీపీలకు సీఎం రేవంత్ ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాజా పరిస్థితిని చీఫ్ సెక్రెటరీతో సమీక్షించారు. వ‌ర్షాల పరిస్థితుల్లో రెవెన్యూ, మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య శాఖాధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లకు తావులేకుండా అధికారులు పర్యవేక్షించాలని, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌ని స్పష్టం చేశారు. రిజ‌ర్వాయ‌ర్ల గేట్లను ఓపెన్ చేయాల్సిన పరిస్థితులను అంచనా వేసిన వెంటనే దిగువ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌న్నారు. సీఎం ఆదేశాల మేరకు చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, డీజీపీ జితేంద‌ర్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, పోలీసు క‌మిష‌న‌ర్లు, కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు.


Similar News