రేషన్ కార్డుల జారీకి బ్రేక్.. ఆగిన ఉచిత వైద్యం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ వైద్యానికి దూరంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేసి చికిత్స చేయించుకుంటున్నాయి. తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం వైట్ రేషన్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ వైద్యానికి దూరంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేసి చికిత్స చేయించుకుంటున్నాయి. తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం వైట్ రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతోనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెల్ల కార్డుకు, ఉచిత వైద్యానికి ప్రభుత్వం లింక్ పెట్టడంతో అర్హత ఉన్నా.. లక్షలాది మంది సర్కారు వైద్యానికి దూరమవుతున్నారు.
పేదలకు ఖరీదైన వైద్యం కోసం..!
పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2007, ఏప్రిల్ 1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలోనూ అదే పేరుతో ఈ పథకం కొనసాగుతోంది. వివిధ వైద్య విభాగాల కింద 1044 రకాల చికిత్సలకు అదనంగా మరికొన్ని చేర్చి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వైద్యం అందిస్తున్నారు. ఆధార్ తో అనుసంధానమై తెలుపు రేషన్ కార్డు ఉన్నప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ పథకానికి అర్హులు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాది రూ. 2.5 లక్షల వరకు వైద్య బీమా లభిస్తుంది. ఇలాంటి పథకాన్నే 'ఆరోగ్యభాగ్య' పేరుతో కర్ణాటకలో, 'ముఖ్యమంత్రి అమృతం' పేరుతో గుజరాత్ లో, 'ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా' పేరుతో తమిళనాడులో అమలు చేస్తున్నారు.
కొత్త కార్డులు లేవు
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు బ్రేక్ వేశారు. వివిధ కారణాలతో 2013 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. ఆరేండ్ల కిందట ప్రభుత్వం రేషన్ కార్డుల్లో మార్పులు తీసుకువచ్చింది. అప్పుడు పాత వాటినే పునరుద్ధరించారు. అయితే కొత్తగా కార్డులు జారీ చేయలేదు. దీనికితోడుగా ఫుడ్ సెక్యూరిటీ కార్డులంటూ తాత్కాలికంగా కొన్ని మంజూరు చేశారు. అంతే మినహా... తెల్ల రేషన్ కార్డులు జారీ చేయలేదు. అంతకు ముందు బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టి లక్షల కార్డులను తొలగించారు. వీటిలో కొన్ని అర్హులైన పేదలవి కూడా తొలగిపోయాయి. అలాంటి వారితో పాటుగా కొత్త వారికి కూడా జారీ చేస్తామని ప్రభుత్వం ప్రతి ఏడాది చెబుతూనే వస్తోంది. బోగస్ కార్డుల ఏరివేత తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం 8.54 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిపై గ్రామాల్లో గతేడాది క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో 5.46 లక్షల దరఖాస్తులను అర్హమైనవిగా తేల్చారు. కానీ, కార్డుల పంపిణీ పెండింగ్‌లో పడింది. దీనికి తోడుగా 2019 అక్టోబర్ నుంచి దీనికి సంబంధించిన వెబ్ సైట్ పని చేయడం లేదు. ఇప్పుడు కొత్త దరఖాస్తులకు అవకాశం లేకుండా పోయింది. పౌరసరఫరాల శాఖ అధికారిక లెక్కలు, గ్రామాలు, పట్టణాల్లో చేసిన పరిశీలన ప్రకారం కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు 5.46 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో తల్లిదండ్రుల నుంచి వేరైనా వివాహిత జంటలు పెట్టుకున్న మ్యుటేషన్ కార్డుల విషయం కూడా చాలా వరకు పెండింగ్‌లోనే ఉంది. ఇప్పటికీ ఇంకా దరఖాస్తు చేసుకోలేని వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉండవచ్చని అంచనా.
ఆరోగ్య శ్రీకి ఆటంకం
తెల్ల రేషన్ కార్డులు ఉంటేనే ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేస్తారు. అయితే దీనికి ప్రభుత్వం ఇచ్చిన ఫుడ్ సెక్యూరిటీ కార్డును పరిగణలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా కొత్త కార్డులు ఇవ్వడం మొత్తం ఆగిపోయింది. ఆరోగ్య శ్రీ కార్డులను 9 ఏండ్ల నుంచి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొంతమంది డయాలసిస్ పేషెంట్లు వైద్యం కోసం వెళ్తుంటే ఆరోగ్య శ్రీ కార్డు తప్పనిసరి కావడంతో ఖరీదైన వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. కొంతమంది వైద్యం చేయించుకుని సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. కానీ లక్షల్లో వైద్యానికి ఖర్చు అయినా... ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద ఇస్తున్నది ఎటూ సరిపోవడం లేదు.
మంత్రివర్గం ఆమోదించినా!
గతేడాది జూన్ 8న సమావేశమైన కేబినెట్ 4,46,168 కార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేవలం 15 రోజుల్లోగా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలని మంత్రివర్గం సంబంధిత అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో 87.43 లక్షల రేషన్ కార్డులుండగా, కొత్త కార్డుల జారీతో సుమారు 92 లక్షలకు పెరుగుతుందని సివిల్ సప్లై శాఖ అంచనా కూడా వేసింది. 2.83 కోట్ల మందికి రేషన్ పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. కానీ, మంత్రివర్గం ఇచ్చిన 15 రోజుల గడువు దాటి 8 నెలలు గడిచినా ఒక్క కార్డు కూడా అందలేదు.