Harish Rao: నిజాలు చెప్తే భుజాలెందుకు తడుముకుంటున్నారు.. పొన్నంకు హరీశ్ కౌంటర్

మంత్రి పొన్నంకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-09-22 09:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఎల్లంపల్లి ప్రాజెక్టు తామే పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిష్ప్రయోజనంగా మారిందని, ఎల్లంపల్లి జలాలతోనే మల్లన్నసాగర్ నిండిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు ఆదివారం కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కూలిపోయిందంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు అదే కాళేశ్వరం వ్యవస్థను మాత్రం బ్రహ్మాండంగా వినియోగించుకుంటూ “కాళేశ్వరం ప్రాజెక్టు వృథా” అన్న సిద్ధాంతాన్ని వారే అబద్దమని నిరూపిస్తున్నారన్నారు. నన్ను విమర్శించే పనిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ తన అవగాహన రాహిత్యాన్ని పొన్నం బయట పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇవాళ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. మల్లన్నసాగర్ వద్ద నిజాలు చెబితే దానికి పొన్నం భుజాలు తడుముకొని “మేము ఎత్తిపోసింది కాళేశ్వరం నీళ్ళు కావు ఎల్లంపల్లి నీళ్ళు” అని నీళ్ళు నములుతున్నాడని సెటైర్ వేశారు. ఎల్లంపల్లి నీరే అయినా అవి కాళేశ్వరం నీళ్లే.. ఎత్తిపోసింది కాళేశ్వరం పంపింగ్ వ్యవస్త ద్వారానే అని ఇకనైన పొన్నం ప్రభాకర్ ఒప్పుకోవాలన్నారు.

'తాళం వేసితిని .. గొళ్ళెం మరచితిని' అన్న చందంగా..

గత కాంగ్రెస్ పాలనలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరుకే పూర్తి చేశారు తప్ప నీళ్లు నింపింది లేదు, రైతులకు ఇచ్చింది లేదన్నారు. 'తాళం వేసితిని .. గొళ్ళెం మరచితిని' అన్నట్టు మీరు అన్ని ప్రాజెక్టులను అప్పగించినట్టు ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా నిరుపయోగంగా మాకు అప్పగిస్తే దాన్ని మేము రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ, పునరావాసం, హై లెవల్ బ్రిడ్జీ, రహదార్ల నిర్మాణం కోసం 2,052 కోట్ల రూపాయలు వెచ్చించించి.. బరాజ్ ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చిందన్నారు. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందన్న వాస్తవాన్ని పొన్నం ప్రభాకర్ గుర్తించకపోయినా కరీంనగర్ రైతాంగానికి తెలుసన్నారు. ఎల్లంపల్లి, నంది మేడారం, మిడ్ మానెరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు ప్రాణహిత ప్రాజెక్టులో భాగమే అని పొన్నం నిజాయితీగా ఒప్పుకున్నందుకు సంతోషమని, ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేసినప్పుడు ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా అలైన్మెంట్ మార్చలేదని మేము గతంలో ఎన్నోసార్లు చెప్పామన్నారు. సీడబ్ల్యూసీ సలహాల మేరకు ఈ జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచామన్నారు. రీ ఇంజనీరింగ్ తర్వాత ఎల్లంపల్లి ఇప్పుడు కాళేశ్వరంలో భాగం అన్నారు.

అయితే అసెంబ్లీలో ఉత్తమ్ అబద్ధాలు చెప్పారా?

కాళేశ్వరం మొత్తంగా ఒక సమగ్ర గోదావరి వ్యాలీ అభివృద్ది ప్రాజెక్టు గానే చూడాలి తప్ప విడివిడి ప్రాజెక్టులుగా చూడడం అనేది అవగాహనారాహిత్యం అవుతుందన్నారు. ఈ సంగతిని పొన్నంతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు గమనిస్తే మంచిదని హితవు పలికారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులో ఒక చిన్న భాగమైన మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయినట్టు, ప్రాజెక్టు మీద ఖర్చు చేసిన లక్ష కోట్లు వృథా అయిపోయాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఉత్తర తెలంగాణ సీనియర్ నాయకుడిగా పొన్నం ప్రభాకర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లింకు-1 పునరుద్దరణపై దృష్టి పెట్టాలి. పునరుద్దరణ పనులు పూర్తి చేసి 2025 వానాకాలం పంట కాలానికైనా లింకు-1 ని వినియోగంలోకి తీసుకు రావాలని సూచించారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు అందిందో మీ నీళ్ళ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారని ఈ విషయం పొన్నం అప్పుడే మరచిపోయారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చెప్పిన లెక్కలు అబద్దం అయితే శాసన సభ్యులను తప్పుదోవ పట్టించినందుకు ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ పెట్టవలసి వస్తుంది. ఈ విషయం మీద పొన్నం గారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.


Similar News