డేంజర్ జోన్‌లో సగం మంది BRS మినిస్టర్లు.. టికెట్ డౌటేనా?

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ, సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితులపై సర్వే చేయిస్తున్నారు.

Update: 2023-01-07 01:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ, సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితులపై సర్వే చేయిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్ ఇస్తామని గతంలో ప్రకటించినా.. సర్వేల ఆధారంగానే కేటాయింపు ఉంటుందని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. ఇక రాష్ట్ర మంత్రుల్లో సగం మంది డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలిసింది. సొంత నియోజకవర్గాల్లో వారు గెలవలేని పరిస్థితిలో ఉన్నట్టు టాక్. వచ్చే ఎన్నికల్లో వారికి బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయించడం అనుమానమే. సేకరించిన రిపోర్టును సదరు మంత్రులకు వివరించిన అధిష్టానం.. ఆరు నెలల్లో తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. లేదంటే వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి వస్తుందని సంకేతం ఇచ్చినట్టు తెలిసింది. మరోవైపు కొత్త వారి ఎంపిక కోసం ప్రగతిభవన్ వర్గాలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చర్చ జరుగుతున్నది.

10 మంది మంత్రులపై నెగెటివ్ టాక్

రాష్ట్ర కేబినెట్‌లో సీఎం కేసీఆర్‌తో కలుపుకుని మొత్తం 17 మంది మంత్రులున్నారు. వీరిలో సుమారు 10 మందిపై వారి సొంత నియోజకవర్గాల్లో నెగెటివ్ ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో వారు గెలవలేని పరిస్థితిలో ఉన్నారని సర్వే రిపోర్టులో తేలినట్టు తెలిసింది. వారి బంధువులు, స్నేహితుల యాక్టివిటీస్ వల్లే మినిస్టర్లకు చెడ్డ పేరు వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. కొందరు మంత్రుల నియోజకవర్గాల్లో వారి తమ్ముళ్లు, కొడుకులు, బావమరుదులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఇంకొంత మంది మంత్రులకు చెడ్డ పేరు రావడానికి వారికి సన్నిహితంగా ఉన్న లీడర్లే కారణమని టాక్. వారు చేస్తున్న అరాచకాల వల్లే మంత్రులు విమర్శల పాలవుతున్నారని సమాచారం. రియల్ ఎస్టేట్ వెంచర్లలో, అపార్ట్‌మెంట్స్‌లో వాటాలు డిమాండ్ చేయడం, అడిగినంత ఇవ్వకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులున్నాయి. స్థానికంగా ఏ చిన్నా దుకాణం పెట్టినా తమ అనుమతి తప్పనిసరి అంటూ కొందరు మంత్రుల సన్నిహితులు ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

'రెడ్డి'ల్లోనే ఎక్కువ!

రాష్ట్ర కేబినెట్‌లో ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఆరుగురు ఉన్నారు. అందులో ఐదుగురు మినిస్టర్లపై నియోజకవర్గాల్లో నెగెటివ్ ఫీలింగ్ ఉన్నట్టు టాక్. వారిపై ఎందుకు వ్యతిరేకత ఉన్నదనే విషయాన్ని సైతం అధిష్టానం సదరు మంత్రులకు వివరించిందని సమాచారం. ఓ మంత్రి నిత్యం వివాదాల్లో ఉండటం, లోకల్‌గా పార్టీ కేడర్‌తో సఖ్యత లేకపోవడంతో పాటు పార్టీ పెద్దలకు సైతం తలనొప్పిగా మారారని తెలిసింది. మరో ఇద్దరు మంత్రులు..వారి కుటుంబ సభ్యులు, సన్నిహిత లీడర్ల ఆగడాలను కట్టడి చేయలేకపోతున్నారని, అందుకే వారిపైనా నెగెటివ్ టాక్ ఉన్నదని సమాచారం. మరో ఇద్దరు మంత్రులు..వారి నియోజకవర్గాల్లో అపోజిషన్ పార్టీ అభ్యర్థుల కన్నా స్ట్రాంగ్‌గా లేరని, ఎప్పుడూ అందుబాటులో ఉండరని ప్రజల నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తున్నట్టు టాక్. ప్రజలు ఏదైనా పని కోసం క్యాంప్ ఆఫీస్‌‌కు వెళ్తే అక్కడి సిబ్బంది తీరుతో ఇబ్బందులు పడుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఉత్తర తెలంగాణ‌కు చెందిన ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రిపై ఆయన సామాజిక వర్గానికి చెందిన లీడర్లే వ్యతిరేకంగా ఉన్నట్టు సర్వేలో తేలినట్టు సమాచారం.

'బీసీ' మంత్రులు కూడా..

కేబినెట్‌లో ఉన్న ఇద్దరు బీసీ మంత్రులకూ సర్వేలో నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు తెలిసింది. ఇందులో ఓ మంత్రికి తన సన్నిహితుల తీరే పెద్ద సమస్యగా మారిందనే చర్చ జరుగుతున్నది. ఆ మంత్రి వద్ద ఎప్పుడూ ఓ టీమ్ ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మంత్రి వద్దకు వెళ్లాలంటే ముందుగా ఆ టీమ్ సభ్యులను కలవాలనే కండీషన్ ఉన్నట్టు ప్రచారం. మరో బీసీ మంత్రికి సన్నిహిత బంధువు వల్లే చెడ్డ పేరు వచ్చినట్టు పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఆయనే షాడో మినిస్టర్‌గా వ్యవహరిస్తునట్టు సమాచారం. ఆయన చెప్పినట్టుగానే అధికారులు పని చేస్తారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నట్టు తెలిసింది. ఎస్సీ వర్గం నుంచి ఒకరు, ఎస్టీ వర్గం నుంచి మరొకరు కేబినెట్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే వీరిద్దరికీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇందులో ఒకరు గెలవడం కష్టమని అధిష్టానానికి రిపోర్టు అందినట్టు సమాచారం. ఇక సగం మంది మంత్రులపై నెగెటివ్ రిపోర్టు రావడంతో ఆ స్థానాల్లో బరిలోకి దింపేందుకు కొత్త అభ్యర్థుల కోసం పార్టీ పెద్దలు వెతుకులాట ప్రారంభించినట్టు సమాచారం. ఇందుకు సొంత పార్టీలో ఉన్న ఆశావహులతో పాటు ఇతర పార్టీలో ఉన్న లీడర్ల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు టాక్. విపక్షాల అభ్యర్థులు స్ట్రాంగ్‌గా ఉన్న ప్రాంతాల్లో వారిని బీఆర్ఎస్‌లోకి జాయిన్ చేసుకునే ప్రయత్నాలు మొదలైనట్టు సమాచారం.

Also Read...

T BJP నేతలపై హైకమాండ్ నిఘా.. ఆ లీకులపై సీరియస్ 

Tags:    

Similar News