‘సాంకేతిక సమస్యలు కామన్’.. మేడిగడ్డ ఘటనపై గుత్తా సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ మూడేళ్లకే
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ మూడేళ్లకే దెబ్బతినడంపై ప్రతిపక్షాలు భగ్గుంటున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎంలా మారిందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల వేళ స్టేట్ పాలిటిక్స్‌లో కీలకంగా మారిన మేడిగడ్డ ఇష్యూపై బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎక్కడ నోరు విప్పడం లేదు. ప్రతిపక్షాలు విమర్శులు గుప్పిస్తున్నా గులాబీ నేతలు మాత్రం సెలైన్స్ పాటిస్తున్నారు.
ఈ క్రమంలో మేడిగడ్డ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. బుధవారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో గుత్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ ఇష్యూపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ పార్టీ పని. మేడిగడ్డ బ్యారేజీ అంశంలో కూడా అదే జరుగుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదు. సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడు వస్తాయి. ప్రకృతి వైపరీత్యాల సమస్యలపై అబండాలు సరికాదు’’ అని గుత్తా వ్యాఖ్యానించారు. కాగా, గుత్తా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కేవలం మూడేళ్లలోనే దెబ్బ తినడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వేల కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన ప్రాజెక్ట్ మూడేళ్లలోనే దెబ్బ తింటే.. దానిని బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన గుత్తా.. చిన్న సమస్యగా మాట్లాడటంపై ప్రతిపక్ష నాయకులు భగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే మేడిగడ్డ ఇష్యూను బీఆర్ఎస్ చిన్న సమస్యలాగా మాట్లాడుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మేడిగడ్డ ఇష్యూపై గుత్తా చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.