Gunpark: సాయిబాబా సంతాప సభకు అనుమతి నిరాకరణ.. అభిమానులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం

గన్ పార్క్ వద్ద ప్రొ.సాయిబాబా సంతాప సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

Update: 2024-10-14 05:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:గన్ పార్క్ వద్ద ప్రొ.సాయిబాబా సంతాప సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రొ. సాయిబాబా అనారోగ్య సమస్యలు, గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంతిమయాత్రకు ముందు గన్ పార్క్ వద్ద సంతాప సమావేశం ఏర్పాటు చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం సంతాప సభ ఏర్పాటు చేసేందుకు ఆయన భౌతికకాయాన్ని నిమ్స్ ఆసుపత్రి నుంచి గన్ పార్క్ వద్దకు తరలించారు. ఈ సభకు హాజరయ్యేందుకు సీపీఐ నారాయణ సహా వామపక్షాల నేతలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

కేవలం 5 నిమిషాలు సంతాప సమావేశం ఏర్పాటు చేస్తామని కోరినా అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులు, అభిమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి సాయిబాబా భౌతికకాయాన్ని అంబులెన్స్ లోనే ఉంచి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినా అనుమతివ్వలేదు. దీంతో సాయిబాబా పార్థీవ దేహాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పలువురు ప్రముఖులు నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. పుస్తకాలు చదివే వారు మేధావులు కాదని, సమాజాన్ని చదివిన వారే మేధావులని.. ప్రొ. సాయిబాబా ఈ కోవలోకే వస్తారని అన్నారు. అలాగే ఆయనను పదేళ్లు అన్యాయంగా జైళ్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో దోషులు ఎవరో తేల్చాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తామని నారాయణ వెల్లడించారు. 


Similar News