బీజేపీలో గ్రూపులు! ఎన్నికల వేళ అంతర్గత సంక్షోభంతో హై టెన్షన్

బీజేపీలో గతంలో ఎన్నడూ లేని కల్చర్ స్టార్ట్ అయింది.

Update: 2023-06-12 01:51 GMT

బీజేపీలో గతంలో ఎన్నడూ లేని కల్చర్ స్టార్ట్ అయింది. అన్ని పార్టీల తరహాలోనే కమలంలోనూ గ్రూపులు మొదలయ్యాయి. రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా కొందరు నేతలు ఎవరికి వారుగా ఢిల్లీ వెళ్లడం, జాతీయ నేతలతో సమావేశమవ్వడం, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం కొనసాగుతున్నది. దీంతో పార్టీ కేడర్‌లో గందరగోళం నెలకొంది. టీబీజేపీలో ఏం జరుగుతున్నదోనన్న అయోమయం వారిలో ఏర్పడింది.

దీనికి తోడు స్టేట్ చీఫ్ మార్పుతో పాటు మరికొన్ని పదవులు విషయంలో వార్తలు చక్కర్లు కొట్టడంతో నేతల్లోనూ కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. ఇదే సమయంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఆదివారం పార్టీ సీనియర్ నేతలంగా మీటింగ్ ఏర్పాటు చేయడం ప్రాధన్యాన్ని సంతరించుకున్నది. సమావేశం అనంతరం పార్టీ నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని అంటూ జితేందర్‌రెడ్డి చెప్పడంతో పాటు పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. పార్టీలోని వర్గ పోరు, అంతర్గత సంక్షోభం కేడర్‌లో గందరగోళానికి కారణమైంది. గతంలో ఎన్నడూ లేని కొత్త కల్చర్ బీజేపీలో మొదలైంది. అన్ని పార్టీల తరహాలోనే బీజేపీలోనూ రాష్ట్ర స్థాయిలో గ్రూపులు మొదలయ్యాయి. ఒకరిపై మరొకరు జాతీయ నాయకులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

పోటాపోటీగా మీటింగులు పెట్టుకుంటున్నారు. ఎవరికి వారుగా ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలతో సమావేశమవుతున్నారు. రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియని అయోమయ వాతావరణం నెలకొన్నది. స్టేట్ పార్టీ చీఫ్ మార్పు ఉంటుందని, ప్రచార కమిటీ బాధ్యతలు ఫలానావారికి దక్కుతున్నదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, మీడియాలో వస్తున్న కథనాలు కేడర్‌ను కన్‌ఫ్యూజన్‌కు గురిచేస్తున్నాయి. ఏ నేత ఏ వర్గమో.. అనే జనరల్ టాక్ మొదలైంది. కర్ణాటక రిజల్టు తర్వాత పార్టీ కార్యకలాపాలు తగ్గిపోయి కేడర్ నీరసంగా మారిన పరిస్థితుల్లో అంతర్గత సంక్షోభం అనేక రకాల సందేహాలకు కారణమవుతున్నది.

రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా పర్యటనలు

పార్టీలోని కొందరు నేతలు రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ మీటింగులు పెట్టుకోవడం మింగుడపడలేదు. పార్టీ స్టేట్ చీఫ్ మారుతారని, బీసీలకే సీఎం పదవి వస్తుందని, ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఫలానా వ్యక్తికి ఇస్తారని.. ఇలాంటివన్నీ బీజేపీ రాష్ట్ర యూనిట్‌లో వివిధ స్థాయిల్లో చర్చకు దారితీశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇవి మరింత ముదరడం పార్టీ ఇమేజ్‌కు ఇబ్బందికరంగా మారింది.

బీజేపీ పని అయిపోయిందని, ఇక పార్టీలో చేరేవారెవరూ ఉండరని స్వయంగా ఆ పార్టీ నేతలే పరోక్షంగా కామెంట్స్ చేయడం మరింత గందరగోళం సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పలువురు సీనియర్ నేతలు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో ఆదివారం సమావేశం కావడం గమనార్హం. పార్టీ అధ్యక్ష పదవి కోసం, ప్రచార కమిటీ చైర్మన్ పోస్టు కోసం, పార్టీలో కీలక బాధ్యతలను చేపట్టడం కోసం ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నారంటూ ఊహాగానాలు, వార్తలు వెలువడుతున్న సమయంలో ఈ మీటింగ్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

మాజీ ఎంపీలు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతి, రవీంద్రనాయక్, ఉద్యోగ సంఘం నేత విఠల్, దేవయ్య, మాజీ మంత్రి విజయరామారావు తదితరులంతా జితేందర్‌రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఈటల రాజేందర్ తీరు పార్టీకి ఎలాంటి చిక్కులు తెస్తున్నదో లోతుగా చర్చించారు. పార్టీ సంక్షోభానికి కారణమవుతున్న ఆయన వ్యవహారాన్ని తప్పుపట్టారు. రాష్ట్ర యూనిట్ స్వతంత్రంగా పనిచేయడానికి ఈటల రాజేందర్ వ్యవహారం ఇబ్బందికరంగా మారిందనే అసంతృప్తి వ్యక్తమైంది.

ఒక పథకం ప్రకారం కేసీఆర్ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ నాయకత్వం ఇలాంటి అంశాలపై సీరియస్‌గా వ్యవహరించాల్సిందిగా కోరుతామని పేర్కొన్నారు. గ్రూపులు, వర్గాలు లేకుండా పార్టీని గాడిన పెట్టి స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం విషయాన్ని చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నందున పార్టీని వివిధ స్థాయిల్లో బలోపేతం చేయడంపై చర్చించారు. సైద్ధాంతిక పునాదితో పనిచేసే బీజేపీలో గ్రూపు కల్చర్ చోటుచేసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా మీడియాకు లీకులిస్తూ కన్‌ప్యూజన్‌ను సృష్టించే చర్యలతో జరిగే నష్టంపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు.

‘బండి’కి సపోర్ట్

పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కు మద్దతుగా ఉన్నామనే మెసేజ్‌ను ఈ మీటింగ్‌లో నేతలంతా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని ఈ సమావేశం అనంతరం జితేందర్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే సంప్రదాయం బీజేపీలో ఉంటుందని, రాత్రికి రాత్రే మార్చే విధానం ఉండదని, ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్‌ మార్పు అకస్మాత్తుగా జరిగే ప్రక్రియ కాదని కుండబద్దలు కొట్టారు.

కేంద్ర పెద్దలను కలవడం ద్వారా, ఢిల్లీ టూర్ల ద్వారా, మీటింగుల ద్వారా నాయకత్వ మార్పు ఉండదని స్పష్టం చేశారు. నిన్నమొన్నటివరకూ ఈ నేతలంతా ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉన్నారనే అభిప్రాయం నెలకొన్నది. కానీ తాజా సమావేశంలో వీరంతా ఒక్కటై బండి సంజయ్ నాయకత్వానికి మద్దతు పలకడం అనూహ్య పరిణామం. పార్టీ నాయకత్వాన్ని మార్చాలంటూ ఈటల రాజేందర్ పట్టుబడుతున్నట్టు కేడర్‌ కన్‌ప్యూజన్‌‌లో ఉన్న టైంలో ఈ మీటింగ్ జరగడం విశేషం.

ఈ మీటింగ్ ఎవరి ప్రోద్బలంతో జరిగిందనే అంశం ఎలా ఉన్నా ఈటల రాజేందర్ కోరుకుంటున్న తీరులో స్టేట్ లీడర్‌షిప్‌లో హఠాత్తుగా మార్పు ఉండదనే స్పష్టత కేడర్‌కు చేరింది. బండి సంజయ్ స్టేట్ పార్టీ చీఫ్ అయిన తర్వాతనే బీజేపీ బలపడిందని జితేందర్‌రెడ్డి సహా పలువురు నేతల మాటల్లో వ్యక్తమైంది. మీడియాకు లీకులు ఇవ్వడం ద్వారా అటు ప్రజలు, ఇటు పార్టీ కేడర్‌ గందరగోళంలో పడ్డారని జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సీనియర్ నేతలంతా ఈ మీటింగ్‌లో ఒకవైపు బండి సంజయ్‌కే మద్దతు పలకడం, ఈటల రాజేందర్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఈ విషయాన్ని గ్రహించిన ఈటల రాజేందర్ సైతం సన్నిహితంగా ఉన్న కొద్దిమంది మీడియా మిత్రులతో ఇకపైన సైలెంట్‌గా ఉంటానని, చిట్‌చాట్‌ లాంటివాటికి కూడా దూరంగా ఉంటానని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో ఇకపైన నోరెత్తదల్చుకోలేదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. జితేందర్‌రెడ్డి నివాసంలో జరిగిన తాజా మీటింగ్ తర్వాత పార్టీ లీడర్ల మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం. అమిత్ షా ఈ నెల 15న ఖమ్మం సభకు వస్తున్న సమయంలో ఈ మీటింగ్ జరగడం గమనార్హం.


Similar News