ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్ఎస్‌లో కొత్త లొల్లి!
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ గూటిలో గ్రూపుల లొల్లి షురువైంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ గూటిలో గ్రూపుల లొల్లి షురువైంది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ లో వర్గాలు ఏర్పడ్డాయి. అయితే.. అందరినీ సమన్వయం చేసేందుకు అధిష్టానం ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టింది. ఇవి పార్టీకి ఏ మేరకు మేలు చేస్తాయోననే తెలియని పరిస్థితి నెలకొంది. ఏకతాటిపైకి వస్తారా ? రారా? అనేదానిపై పార్టీ అధినేత మల్లగుల్లాలు పడుతున్నారు. నేతలు, కార్యకర్తల మధ్య గ్యాప్ పై భవిష్యత్ ఎన్నికల్లో ఏ మేరకు ఎఫెక్ట్ పడుతుందోననే టెన్షనూ పట్టుకుంది.
ఎవరికివారే మీటింగ్‌లు
గులాబీ పార్టీ గ్రూపు రాజకీయాలకు నిలయంగా మారడంతో పాటు నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఉద్యమ కాలం నుంచి పని చేస్తున్నవారు ఓ జట్టుగా ఉంటే.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారో గ్రూప్ కట్టారు. ఇంకొంతమందితో మూడోవర్గమూ ఏర్పడి ఎవరికి వారే కేడర్ తో మీటింగ్ లు నిర్వహించుకుంటున్నారు. పార్టీ ప్రోగ్రామ్స్ సైతం పోటాపోటీగా చేపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు నెలకొనగా దాడులకు సై అంటే సై అంటున్నారు. అధిష్టానం ఇవేవి పట్టించుకోకుండా... ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఇన్ చార్జులుగా ఎమ్మెల్సీలను నియమించింది. నియోజకవర్గ, మండల స్థాయిలో సమ్మేళనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వర్గపోరు తీవ్రస్థాయిలో ఉండగా.. ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక అధిష్టానం సతమతమవుతున్నది.
ఓడిన చోట నారాజ్‌గా లీడర్లు
మునుగోడు బై పోల్ సమయంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టింది. క్యాడర్, నేతల మధ్య గ్యాప్ తగ్గించి సక్సెస్ కొట్టింది. అదే ఫార్ములాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఫాలో కావాలనుకుని అధిష్టానం ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకుంది. ఇతరపార్టీల్లో ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నవారికీ పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. నియోజకవర్గానికి ఎమ్మెల్యే అన్నీ అని అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో పార్టీ సభ్యత్వాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా చెక్కులు పంపిణి ఇలా ప్రతిది ఎమ్మెల్యేలకే కట్టబెట్టింది. దీంతో పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన లీడర్లు జీరోలుగా మారిపోయారు. వారికి తగిన ప్రాధాన్యత లేక పోవడం నారాజ్ గా ఉండిపోయారు. పార్టీ అధిష్టానం కూడా పట్టించుకోకపోవడంతో ఇక లాభం లేదనుకుని సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండగా సొంత కేడర్ ను పెంచుకునే పని ముమ్మరం చేసుకున్నారు. ఇక సమ్మేళనాలు నిర్వహిస్తుండగా ఇప్పుడైనా ఏకతాటిపైకి వస్తారా? లేదా..? అనేది చర్చనీయాంశమైంది.
ఏం ఇచ్చి.. సమన్వయం చేస్తారు?
ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తూ గ్రూపులు కట్టిన నేతలకు అధిష్టానం ఏం హామీ ఇస్తుందో తెలియని అయోమయం నెలకొంది. సమ్మేళనాల జిల్లా ఇన్ చార్జులు పార్టీలో వ్యతిరేకవర్గ నేతలను ఎలా కలుపుకుపోతారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై ప్రజల్లోని వ్యతిరేకత.. ఎమ్మెల్యేలపై క్యాడర్ అసంతృప్తి వచ్చే ఎన్నికల్లో కలిసివస్తుందని, ఎమ్మెల్యేగా గెలుస్తున్నామని సొంత కేడర్ కలిగిన నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. సమ్మేళనాలకు కలిసి వస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. సమ్మేళనాలకు ఆహ్వానించినా దూరంగా ఉండాలని, ఒకవేళ సయోధ్యతో వస్తే క్యాడర్ లో పట్టుకోల్పోతామని భావిస్తున్నారు. సొంతక్యాడర్ ను దూరం చేసుకుంటే.. రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారవచ్చని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ను ముంచేది గ్రూపు రాజకీయాలేనని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. గ్రూపులకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని, సీనియర్ నేతలకు పదవుల హామీలు ఇస్తేనే సయోధ్య కుదిరితే సమ్మేళనాలు సక్సెస్ అవుతాయని పార్టీలోని సీనియర్ నేతలూ అంటున్నారు.
Also Read...