‘ఆ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కేవలం ఇంటి అవసరాలకే’
రాష్ట్రంలో గృహజ్యోతి స్కీమ్ అమలుపై సర్కార్ ప్రత్యేక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గృహజ్యోతి స్కీమ్ అమలుపై సర్కార్ ప్రత్యేక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. గృహ జ్యోతి స్కీమ్‌లో భాగంగా వినియోగదారులకు ఉచితంగా అందించే 200 యూనిట్ల విద్యుత్‌ను కేవలం ఇంటి అవసరాల కోసమే వినియోగించాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వ్యాపార అవసరాలకు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడిన వినియోగదారులకు మార్చి నుంచి జీరో బిల్లు అమలు చేయాలని డిస్కంలను ఇంధనశాఖ ఆదేశించింది. రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రజాపాలన లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో ఆధార్‌తో అనుసంధానమైన తెల్ల రేషన్ కార్డు, గృహ విద్యుత్ కనెక్షన్ నంబర్ ఉన్నవాటికి ఈ పథకం వర్తిస్తుందని స్పష్టంచేశారు.
అర్హులైన ఇంటికి 200 యూనిట్ల వరకు జీరో బిల్లు అందజేయాల్సి ఉంటుందని డిస్కంలకు ఆదేశించారు. జీరో బిల్లు కోసం డిస్కంలు ప్రత్యేకంగా వినియోగదారుల పేర్లను మార్చాల్సిన అవసరం లేదని, ఇప్పుడున్న పేర్లతోనే బిల్లులు మంజూరు చేయాలని పేర్కొంది. డిస్కంలు జీరో బిల్లులను ప్రభుత్వానికి పంపిస్తే, ప్రతి నెల 20వ తేదీనాటికి ప్రభుత్వం ఆ రాయితీ మొత్తాన్ని డిస్కంలకు చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ అన్ని అర్హతలు ఉండి, ఈ పథకం కింద జీరో బిల్లు రాకపోతే సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లేదా సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రేషన్‌కార్డు, విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించిన యూఎస్‌సీ వివరాలతో ప్రజాపాలన పోర్టల్ ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అధికారుల నుంచి రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. పరిశీలన అనంతరం అర్హులని తేలితే.. ఆ మరుసటి నెల నుంచి జీరో బిల్లు మంజూరు చేస్తారని స్పష్టంచేశారు. అయితే అప్పటి వరకు కట్టిన బిల్లులు తిరిగి ఇవ్వడం మాత్రం కుదరదని గైడ్ లైన్స్‌లో పేర్కొన్నారు.