నయీం ఆస్తులు, డబ్బులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి: వి.హనుమంతరావు

40 కి పైగా హత్యలు, బెదిరింపులు కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లను తన ఖాతాలో వేసుకుని.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన నయీం గురించి తెలిసిందే

Update: 2024-04-02 13:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: 40 కి పైగా హత్యలు, బెదిరింపులు కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లను తన ఖాతాలో వేసుకుని.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన నయీం గురించి తెలిసిందే. గతంలో కోట్ల రూపాయల భూములు కాజేశాడు. చివరకు పేదల భూములు కూడా లాక్కున్న కరుడుగట్టిన నేరస్థుడు. అయితే నయీం ఎన్ కౌంటర్ అయ్యాక ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ఏమాయ్యాయని తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వి. హన్మంతరావు ప్రశ్నించారు

మంగళవారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నయీం లాక్కున్న పేదల భూములు ఏమయ్యాయి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం ఎలా సీరియస్ గా విచారిస్తుందో.. నయీం ఆస్తులు, డబ్బుల విషయంలో కూడా అలాగే విచారణ చేపట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై దృష్టి సారించాలి. దీన్ని సీరియస్ గా తీసుకుని విచారణ జరిపినట్లైతే.. అక్రమంగా పేదల దగ్గర లాక్కున్న భూములన్ని వారివి వారికి ఇవ్వొచ్చు’’. అని వి. హన్మంతరావు చెప్పుకొచ్చారు.

అలాగే ఫోన్ ట్యాంపింగ్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో బయటపెట్టాలని విహెచ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రముఖ రాజకీయ నేతలు, బిజినెస్‌మెన్ ల ఫోన్లు ట్యాప్ చేశారు. అందులో అసలు సూత్రధారులు ఎవరో తెలియాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్టయ్యారు. దీనిపై విచారణ వేగంగా జరపాలని, అసలు దోషులను బయటకు తీసుకురావాలని తెలిపారు. అలాగే ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీచేసే దాని గురించి చెబుతూ.. టికెట్ నాకు ఇస్తే మాత్రం తప్పకుండా గెలుస్తానని, ఇక్కడే రాజీవ్ గాంధీతో కలిసి తిరిగానని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని వి. హన్మంతరావు వెల్లడించారు.


Similar News