జీతం సర్కారుది.. పని మాత్రం సార్ల ఫ్యామిలీకి..!

రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారుల ఇండ్లలో కొన్నేండ్లుగా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Update: 2024-06-08 02:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారుల ఇండ్లలో కొన్నేండ్లుగా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ఆఫీసుల్లో పనిచేసేందుకు ప్రభుత్వం అటెండర్లను సమకూరుస్తుంది. కానీ ఆఫీసర్లు మాత్రం పవర్ చేతుల్లో ఉండటంతో వారితో తమ సొంత పనులు చేయించుకుంటున్నట్టు తెలిసింది. ఒకరితోనో, ఇద్దరితోనో కాదు.. ఏకంగా పదిమంది సిబ్బందితో ఇంటి పనులు చేయిస్తున్నట్టు అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీరంతా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులేనని టాక్. మెజార్టీ ఐఏఎస్‌ల తీరు ఇలానే ఉన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే దారిలో ఆయా శాఖల హెచ్‌వోడీలు సైతం ఉన్నట్టు సమాచారం.

ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్!

నిబంధనలకు విరుద్దంగా ఐఏఎస్‌లు ఔట్ సోర్సింగ్ స్టాఫ్‌తో సొంత పనులు చేయించుకుంటున్నా.. ఎంప్లాయీస్ యూనియన్లు, ఔట్ సోర్సింగ్ యూనియన్లు నోరు మెదపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి విషయాన్ని ప్రశ్నించే ఉద్యోగ సంఘాలు ఐఏఎస్‌ల తీరుపై ఎందుకు మౌనంగా ఎందుకుంటున్నారనేది కింది స్థాయి ఉద్యోగుల్లో మెదులుతున్న ప్రశ్న. మరో వైపు ఎదురు ప్రశ్నిస్తే తమ ఉద్యోగం ఊడుతుందనే భయంతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది సైతం ఆఫీసర్లు చెప్పినట్టు నడుచుకుంటున్నారని టాక్.

పవర్ చేతిలో ఉండటంతో..

ఆయా ఐఏఎస్‌ల పరిధిలోని ఆఫీసుల్లో ఎంత మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది అవసరం అనే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారిన్ని ఆ శాఖ సెక్రటరీలు, హెచ్‌వోడీలకు ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఆఫీసర్ల సూచన మేరకు ప్రభుత్వం స్టాఫ్‌ను సమకూర్చుతున్నది. నిబంధనల ప్రకారం ఆ స్టాఫ్ ను ఆయా అధికారులు తమ పరిధిలోని ఆఫీసులకు సంబంధించిన పనులకు మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ పలువురు ఐఏఎస్‌లు వారితో ఇంటి పనులు పనులు చేయించుకుంటున్నారు. హౌజ్ కీపింగ్, వెహికిల్ క్లీనింగ్, గార్డెనింగ్, పెట్ కేరింగ్ వంటి పనులు చేయిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ఔట్ సోర్సింగ్ స్టాఫ్‌ను సమకూరుస్తున్న ఏజెన్సీలు సైతం సహకరిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘మాకు ప్రతినెలా బిల్స్ వస్తే చాలు’ అనే ఉద్దేశంతో ఏజెన్సీలు ఉన్నట్టు టాక్.

సీఎంవో ఫోకస్

సెక్రెటేరియట్‌లో పనిచేసే ఐఏఎస్‌ల వద్ద ఎంత మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు? ఎప్పటి నుంచి వారు పనిచేస్తున్నారు? హెచ్‌వోడీ హోదాలో పని చేస్తున్న ఆఫీసర్లు ఎంత మంది స్టాప్‌ను తమ ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు? అనే విషయాలపై సీఎంవో ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఆ వివరాలన్నింటినీ నిఘా వర్గాల ద్వారా సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఓ ఎంప్లాయ్ మరణం వెనుక ఐఏఎస్ వేధింపులు?

ఈ మధ్య సెక్రటేరియట్‌లో కార్మిక శాఖ‌లో పనిచేస్తున్న ఓ డేటా ఎంట్రీ ఎంప్లాయ్ గుండెపోటుతో మరణించారు. ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ సీఎస్ రాణి కుముదిని వేధింపుల వల్ల ఆ ఉద్యోగికి ఆఫీసులో గుండెపోటు వచ్చిందని ఆరోపిస్తూ సచివాలయ ఎంప్లాయీస్ ఆమె చాంబర్‌కు వెళ్లి ఆందోళన చేపట్టారు. అదే రోజు చాలా మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ల వద్ద తాము ఎదుర్కొంటున్న బాధలను వివరించారు. ‘ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే ఐఏఎస్‌లకు చులకన భావం. వారు చెప్పిన పని చేయాలి. ఇంట్లో పనికి వెళ్తే పిల్లల ముడ్లు కడగాలి. కుక్కులకు స్నానాలు చేయించాలి. లేకపోతే ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతారు. ఆ పనులు చేయకపోతే ఉద్యోగం పోతుంది’ అని వివరించారు.

- సెక్రెటేరియట్‌లో ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ఇంటి వద్ద ఏకంగా 10 మంది ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టు టాక్. అందులో సచివాలయం నుంచి ఐదుగురు ఉండగా.. మరో ఐదుగురు ఆయన శాఖ పరిధిలోని పనిచేస్తున్న సిబ్బంది అని సమాచారం. వీరితో సదరు అధికారి ఇంటి పనులు చేయిస్తున్నట్టు తెలిసింది.

- ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ ఇంటి వద్ద సైతం సుమారు 10 మంది ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పనులు చేస్తున్నట్టు తెలిసింది. అందులో కొంత మంది సెక్రెటేరియట్ నుంచి, మరి కొందరిని ఈసీ ఆఫీసు నుంచి సమకూర్చుకున్నట్టు తెలుస్తున్నది.

- ఓ స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న ఆఫీసర్ ఇంటి వద్ద సుమారు ఏడుగురు ఔట్ సోర్సింగ్ స్టాప్ పనిచేస్తున్నారని, అందులో ఎక్కువ మంది మహిళా ఎంప్లాయీస్ ఉన్నట్టు టాక్.

- సెక్రటేరియట్‌లో జీఏడీ విభాగంలో పనిచేసే ఓ అధికారి సైతం ఐఏఎస్‌ల తరహాలో కొంత మంది ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌ను ఇంటి అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది.


Similar News