ఫార్ములా – ఈ రేస్ కేసు విచారణలో ప్రభుత్వం పగడ్బందీ ప్లానింగ్
న్యాయపరంగా ఎక్కడా లోపాలు లేకుండా, చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. రాజకీయ పరమైన ఆరోపణలకు అవకాశం లేకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా – ఈ రేస్ నిధుల దుర్వినియోగం కేసులో ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. న్యాయపరంగా ఎక్కడా లోపాలు లేకుండా, చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. రాజకీయ పరమైన ఆరోపణలకు అవకాశం లేకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పకడ్బందీగా ప్రణాళిక రచించింది. ఫార్ములా –ఈ రేస్ విషయంలో రూ.55 కోట్ల నిధులను ప్రభుత్వ అనుమతి లేకుండా రేసుతో సంబంధం లేని కొందరు వ్యక్తుల ఖాతాలకు బదిలీ చేసినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అధికార దుర్వినియోగం, నిధుల మళ్లింపును సీరియస్ గా పరిగణించి ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసింది. ఏసీబీ తన విచారణలో ఆధారాలను సేకరించింది. బాధ్యులపై చర్యలకు సిద్ధమైంది.
ముందస్తు అనుమతులు
ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ విషయంలో చట్ట పరంగా తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులను తీసుకుంటున్నది. కేటీఆర్ పై కేసు, విచారణ, ప్రాసిక్యూషన్ కు అవసరమైన అనుమతి ఇవ్వాల్సిందిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గవర్నర్ కు లేఖ రాశారు. కేసు విచారణకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సైతం కోరినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. దీంతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దీనిపై న్యాయపరమైన సలహా తీసుకోవడానికి ఢిల్లీలోని అటార్ని జనరల్ కు లేఖ రాసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నాలుగు రోజుల క్రితమే ఈ లేఖ రాసినట్లుగా తెలిసింది. అటార్నీ జనరల్ నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా గవర్నర్ తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
పర్మిషన్ రాగానే చర్యలు స్టార్ట్
నిధుల దుర్వినియోగంలో కేటీఆర్ పై కేసు నమోదు చేసి విచారించేందుకు అవినీతి నిరోధక చట్టం, సెక్షన్ 17ఏ కింద ఏసీబీ గవర్నర్ అనుమతి కోరినట్లు తెలిసింది. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణలో రూ.55 కోట్ల ఆర్థిక అవకతవకలను గుర్తించినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఎయుడి) విభాగం నుంచి వచ్చిన లేఖ కాపీ, కేటీఆర్ పేరును ప్రస్తావించి, ఆరోపణల జాబితా గురించి ఏసీబీ డీజీ తన లేఖలో నివేదించారు. ఏసీబీ అభ్యర్థనపై గవర్నర్ 120 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో గవర్నర్ కార్యాలయం కేటీఆర్ పై కేసు, విచారణ, ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వవచ్చా లేదా అనే దానిపై న్యాయపరమైన అభిప్రాయం కోసం ఏసీబీ అభ్యర్థనను భారత అటార్నీ జనరల్‌కు పంపినట్లు తెలిసింది.
2018కి ముందు ఏసీబీ ఏదైనా ప్రజాప్రతినిధిపై కేసు నమోదు చేసిన తర్వాత గవర్నర్ నుంచి అనుమతి తీసుకునేది. కానీ 2018లో అవినీతి నిరోధక చట్టాన్ని సవరించిన తర్వాత, ఎమ్మెల్యే లేదా ఎంపీని ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ నుంచి ముందుగానే అనుమతి పొందాల్సి ఉంటుంది. అధికారుల ప్రాసిక్యూషన్‌కు సంబంధించి 17ఏ అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పూర్తి అధికారం ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కేసు నమోదు చేయడానికి సీఎస్ అనుమతించినట్లుగా తెలిసింది. దీంతో గవర్నర్ నుంచి అనుమతి రాగానే వరుసగా కేసు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం ఆ తరువాత విచారణ చేపట్టడం వంటి చర్యలు చేపడుతారని సమాచారం. విచారణ తరువాత ఏసీబీ అధికారులు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.