GHMC: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. టీడీఆర్ ఇక తప్పనిసరి?

హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి బదలాయింపు హక్కు (టీడీఆర్‌) డిమాండ్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.

Update: 2025-03-27 02:23 GMT
GHMC: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. టీడీఆర్ ఇక తప్పనిసరి?
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి బదలాయింపు హక్కు (టీడీఆర్‌) డిమాండ్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ప్రత్యేక నిబంధన తీసుకురానున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులకే పరిమితమైన టీడీఆర్‌ను ఓసీ జారీ, భవన నిర్మాణం పూర్తయ్యాక అనుమతి తీసుకునే సమయంలో విధించే కాంపౌండింగ్‌ ఫీ చెల్లింపునకు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం నగరంలో భారీగా ఆస్తులు సేకరించారు. పరిహారం చెల్లింపు ఆర్థిక భారంగా మారుతుండడంతో.. ప్రయోగాత్మకంగా టీడీఆర్‌ను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో 37.32 లక్షల చదరపుగజాల టీడీఆర్ సర్టిఫికెట్లు జారీచేశారు. వీటిలో 20 లక్షల చదరపు గజాలకు సంబంధించిన టీడీఆర్‌లను వినియోగించుకున్నారు. ఇంకా 15.36 లక్షల చదరపుగజాల టీడీఆర్ అందుబాటులో ఉంది.

హెచ్-సిటీ ప్రాజెక్టులకు టీడీఆర్..

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్-సిటీలో భాగంగానే చేపట్టనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, రోడ్డు విస్తరణకు ప్రాజెక్టులకు భూసేకరణ భారం కానుంది. కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్లలో చేపట్టనున్న ప్రాజెక్టులతో పాటు విరంచీ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రోడ్డు విస్తరణ పనులకు భూసేకరణ కోసం రూ.741 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యయం ప్రాజెక్టు వ్యయంలో సగానికి కంటే ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో పరిహారం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో టీడీఆర్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి జీహెచ్ఎంసీ మొగ్గు చూపుతుంది. మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల వెడల్పులో భాగంగా సేకరించిన ఆస్తులకు 400 శాతం, చెరువులు, కుంటల్లో ఆస్తులు కోల్పోయిన వారికి 200 శాతం, చారిత్రక కట్టడాలకు 100 శాతం టీడీఆర్‌ హక్కు కల్పించిన విషయం తెలిసిందే.

డిమాండ్.. సప్లై ఆధారంగానే..

టీడీఆర్ విషయంలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. టీడీఆర్ కావాలని ఫోన్ చేస్తే అందుబాటులో లేదని ఒకరు, రేటు పెరుగుతుందని మరోకరు సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ నుంచి ఏడాదికాలంగా ఎలాంటి టీడీఆర్ సర్టిఫికెట్లు జారీచేయకపోవడంతో డిమాండ్ పెరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. డిమాండ్ సప్లై ఆధారంగా రేట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు టీడీఆర్లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనూ టీడీఆర్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పలువురు నిర్మాణదారులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News