గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతపై ఆధారపడి ఉంది: కేంద్ర మంత్రి సంజయ్ జాజు

వీడియో గేమింగ్ పరిశ్రమ ప్రధానంగా విషయం (కంటెంట్), సృజనాత్మకతపై ఆధారపడిందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.

Update: 2024-11-13 17:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వీడియో గేమింగ్ పరిశ్రమ ప్రధానంగా విషయం (కంటెంట్), సృజనాత్మకతపై ఆధారపడిందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను సృష్టించడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తుందని, తద్వారా భారతదేశం ప్రపంచ గేమింగ్ రంగంలో ఆధిపత్యం చెలాయించగలదని జాజు స్పష్టం చేశారు. భారత సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ) ఏర్పాటుతో వీడియో గేమింగ్ రంగంలో నైపుణ్యాభివృద్ధికి పెద్దఎత్తున ప్రోత్సాహం కల్పిస్తామని అన్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ), గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఎఐ) సదస్సులను బుధవారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా ప్రారంభించారు. అనంతరం సంజయ్ జాజు మాట్లాడుతూ 2025 ప్రథమార్థంలో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ తో మీడియా, వినోద రంగాల్లో భారత్ అంతర్జాతీయ కేంద్రంగా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమావేశానికి హాజరైన ప్రముఖ వీడియో గేమింగ్, ఇంటరాక్టివ్ ఎంటర్టైన్ మెంట్ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలతో సంజయ్ జాజు ప్రత్యేక సమావేశమయ్యారు.

గేమింగ్, యానిమేషన్, సంబంధిత రంగాల్లో పనిచేస్తున్న వారిని ప్రోత్సహించేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఫిక్కీ, సీఐఐలు 52 శాతం, భారత ప్రభుత్వం 48 శాతం ఈక్విటీతో పీపీపీ పద్ధతిలో ఈ సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు సంజయ్ జాజు వెల్లడించారు. 2025 ఫిబ్రవరి 5 నుండి 9 వరకు జరిగే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్- వేవ్స్ గురించి ప్రస్తావించారు. ప్రపంచ మీడియా, వినోద పరిశ్రమలో భారత్ వాటా కేవలం రెండు శాతమేనని, ఇంకా ఏడాదికి 20 శాతం వృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని సంజయ్ జాజు తెలిపారు. దూరదర్శన్ ఫ్రీ డిష్ లో అందుబాటులో ఉన్న దాదాపు 60 ఛానళ్లు ఇకపై ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ఓటీటీ ద్వారా అలనాటి కార్యక్రమాల ఆర్కైవ్ మెటీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు.


Similar News