కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు మాజీ MP వినోద్ కుమార్ లేఖ

కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆమోదించిన భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సంహిత అమల్లోకి

Update: 2024-06-12 17:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆమోదించిన భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సంహిత అమల్లోకి రాకముందే అందులో అభ్యంతరకర అంశాలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. భారత క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో సంస్కరణలు, ఆధునికీకరణను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. న్యాయసంహిత, సురక్ష సంహిత, భారతీయ సంహితలోని కొన్ని అంశాలు ప్రమాదకరంగా ఉన్నాయని అన్నారు. క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలను హిందీలో పేర్కొనడం రాజ్యాంగంలోని 348కు విరుద్దమని, హిందీయేతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆయా చట్టాల్లోని అంశాలను అపార్దం చేసుకోకుండా ఇంగ్లీషులోనూ ప్రచురించాలన్నారు.

చట్టాల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ, పోలీసు, బార్‌ కౌన్సిళ్లు, న్యాయవాదుల సంఘాలు తదితర భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. పోలీసులకు విస్తృత అధికారులు ఇవ్వడం, డిజిటల్‌ సాక్ష్యాల్లో వ్యక్తిగత గోప్యతను పట్టించుకోకపోవడం, జీరో ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో నిష్పాక్షికతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం తదితర లోపాలు కొత్త చట్టాల్లో ఉన్నాయన్నారు. కొత్త చట్టాలపై కొందరు కేరళ కోర్టును ఆశ్రయించారని, తాము పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News