Singireddy: గాలి మాటలు, ఢిల్లీకి మూటలు తప్ప ఒరిగిందేమీ లేదు

కాంగ్రెస్ పాలన రోజుకో గండంలా మారిందని.. గాలి మాటలు, ఢిల్లీకి మూటలు తప్ప 14 నెలల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ రైతు అధ్యయన కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు.

Update: 2025-01-30 16:25 GMT
Singireddy: గాలి మాటలు, ఢిల్లీకి మూటలు తప్ప ఒరిగిందేమీ లేదు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పాలన రోజుకో గండంలా మారిందని.. గాలి మాటలు, ఢిల్లీకి మూటలు తప్ప 14 నెలల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ రైతు అధ్యయన కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. చెప్పిన మాటలు, చేసిన బాసలు ఆకాశానికి అంటాయని.. ఆచరణలో ఫెయిల్ అయ్యారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 420 హామీలతో సాధించింది ఏంటని ప్రశ్నించారు. దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ పాలనను ప్రజలు కోల్పోయి 420 రోజులు అయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో మిర్చి, వేరుశెనగ, పత్తి రైతులు రోడ్డెక్కి అలిసిపోయారని పేర్కొన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లేక తల్లడిల్లుతున్నారని.. రుణమాఫీ జరగక, రైతుబంధు రాక, బోనస్ లేక, కరెంటు రాక, సాగునీళ్లు లేక రైతులు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని అన్నారు.

సీఎం రేవంత్ సహనం కోల్పోయి కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తామని అంటున్నారని.. కానీ, నేడు రాష్ట్రంలో సబ్బండ వర్గాలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారన్నారు. రైతులు అవస్థలు పడుతుంటే కాంగ్రెస్ పార్టీకి సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా కమిటీ ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో పర్యటించి ఓ నివేదిక ఇవ్వాలని నిర్ణయించామని.. తమ పార్టీ నిర్ణయం మేరకు కొంత సాయం అందించామని తెలిపారు. ఢిల్లీకి, విదేశాలకు తిరిగే తీరిక ఉన్న సీఎంకు రైతులను పరామర్శించే తీరిక లేదా? హెలికాప్టర్లలో తిరిగే మంత్రులకు రైతులను పరామర్శించే తీరిక లేదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యయన బృందం వరంగల్ జిల్లా తలారిగూడ పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం గర్హనీయమన్నారు.

ఇప్పుడేమన్నా ఎన్నికలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారని.. కానీ ఆ స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో కొనసాగించడం లేదన్నారు. సీఎం మాట్లాడకుండా ఇప్పుడు స్పీకర్‌తో మాట్లాడిస్తున్నాడని అన్నారు. రాష్ట్ర స్థితిగతుల మీద అవగాహన లేకుండా హామీలు ఇచ్చిన పార్టీకి పాలనకు అర్హత ఉన్నదా.. చేతకానప్పుడు దిగిపోవాలని డిమాండ్ చేశారు. అచ్చంపేట, గద్వాల, మెదక్ ప్రాంతాల్లో రైతులు ప్రభుత్వం మీద తిరగబడుతున్నారన్నారు. ఈ సమావేశంలో సభ్యులు, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, జోగు రామన్న, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ శాసన సభ్యులు అంజయ్య యాదవ్, దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News