తీవ్రంగా ఖండిస్తున్నా.. తీరు మారాలి: కేటీఆర్‌పై స్పీకర్ ఫైర్
మాజీ మంత్రి కేటీఆర్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండిపడ్డారు..
దిశ, తెలంగాణ బ్యూరో: ‘నేను స్పీకర్‌ను... నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారు. నేను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్.. స్పీకర్‌పై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు...ఇంకా బీఆర్ఎస్, కేటీఆర్ తీరుమారలేదు.’ అని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది... శాసనసభలో ప్రతిపక్షానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదని మండిపడ్డారు. శిక్షణా తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో బుధవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేజిస్లేచర్ ఒరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో చట్టసభలది క్రియాశీల పాత్ర, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలను రూపొందించాల్సిన బాధ్యత శాసన సభ్యులపై ఉంటుందన్నారు. చట్టాల రూపకల్పనతో పాటుగా అనంతరం వాటి అమలు తీరు, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుందన్నారు. శాసన సభ్యులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారని, చర్చించుకుంటారన్నారు. సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండడంతో సభ్యులు ఏమి మాట్లాడుతున్నారో ప్రజలకు సులభంగా తెలిసిపోతుందన్నారు. గతంలో మాదిరిగా మొక్కుబడిగా ఒకటి రెండు రోజులు కాకుండా ప్రభుత్వం కోరిన విధంగా ఎక్కువ రోజులు సభా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లాగా ఉత్తమ లేజిస్లేటర్ అవార్డు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు.
గతంలో శాసనసభ సమావేశాల సమయంలో సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్న చరిత్ర ఉన్నదన్నారు. శాసనసభ వ్యవహారాలపై సభ్యులకు పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే సభ్యులు సభలో అర్ధవంతంగా మాట్లాడుతారన్నారు. నూతన సభ్యులతో పాటుగా సభ్యులందరికీ ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతంలో సీనియర్ సభ్యులు శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు నూతన సభ్యులకు ఇన్సిపిరేషన్‌గా ఉండేదన్నారు. రోశయ్య, రజీబ్ అలీ, బోడేపూడి వెంకటేశ్వరరావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఓంకార్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, నర్రా రాఘవా రెడ్డి వంటి వారు గొప్ప వక్తలుగా పేరు తెచ్చుకున్నారన్నారు. సభలో మాట్లాడడానికి సమాచారం, వాగ్ధాటితో పాటుగా సభా వ్యవహారాలు, నిబంధనలపై అవగాహన ఉండాలన్నారు. జీరో అవర్, కొశ్చన్ అవర్, రిజల్యూషన్స్, అడ్జర్న్ మెంట్ మెన్షన్స్, పాసింగ్ ఆఫ్ బిల్స్, పాసింగ్ ఆఫ్ బడ్జెట్, సభ్యుల గౌరవ మర్యాదలు, ప్రొటోకాల్, వ్యవహారాలు వంటి ముఖ్యమైన కార్యకలాపాలపై సభ్యులకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలన్నారు. ఈ రెండు రోజుల అవగాహన సదస్సు అందరికి ఉపయోగపడుతుందని, సభ్యులందరు విధిగా పాల్గొని సభ వ్యవహారాలపై అవగాహన తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం కావడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం పీఏలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలతో ప్రజాప్రతినిధులను దూరం చేయడానికి మొదటి కారణం వారేనన్నారు. ఎమ్మెల్యే కోసం ఎవరైనా ఫోన్ చేస్తే పీఏలు దురుసుగా మాట్లాడుతారన్నారని, ఎమ్మెల్యేలు ఫోన్లో అందరితో టచ్‌లో ఉండాలని సూచించారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఆవేదన కలుగుతోందన్నారు. గాలివాటం రాజకీయాలు మొదలయ్యాక కొత్త ఎమ్మెల్యేలే సభలోకి వస్తున్నారన్నారు. గన్ మెన్‌లతో కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తోందని, గెలవగానే పక్కకి వచ్చి చేరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది ఇది సమాజానికి మంచిది కాదన్నారు. అతి సామాన్యుడు కూడా పోటీ చేసే విధంగా ఉండాలన్నారు. మేం సభాపతిగా ఉన్నా సభ ఎన్ని రోజులు నడపాలనే నిర్ణయం ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వం ఎక్కువ రోజులు సభ నిర్వహించాలనుకుంటే ఎక్కువ రోజులు నడుస్తుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధి పదవి అనేది మహోన్నత పదవి అని, అందరికీ ఈ పదవి దక్కదన్నారు. అదృష్టం ఉన్న వారికి మాత్రమే దక్కుతుందన్నారు.
గత పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒరియెంటెషన్ కార్యక్రమాలను నిర్వహించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిర్వహించుకుంటున్నామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచిన తరువాత ప్రమాణస్వీకారం రోజునే ఐడీ కార్డ్ తో పాటు రూల్స్ అండ్ రెగులేషన్స్ పుస్తకాలు ఇస్తాం కానీ వాటిని ఎవరు కూడా చదవడం లేదన్నారు. లేజిస్లేచర్ కి సంబంధించిన పుస్తకాలు తప్పకుండా చదవాలని సూచించారు. ఇప్పుడు ఉన్న 119 ఎమ్మెల్యేల్లో 57 మంది నూతనంగా ఎన్నికైన వారే ఉన్నారని, వారందరూ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంబీబీఎస్ చదివితే డాక్టరు అవుతారు ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అవుతారు అలాగే ప్రజల మనస్సు చదివితేనే ప్రజా ప్రతినిధులం అవుతామన్నారు. ఈ ఐదు సంవత్సరాలు ప్రజలతో మమేకం అయ్యి ఉంటేనే భవిష్యత్‌లో గెలుస్తారన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు రావడం సహజం కానీ ఆ విమర్శలకు భయపడకుండా ప్రతివిమర్శతో ముందుకు వెళ్ళాలన్నారు. చట్ట సభలను ఎన్ని రోజులు అయినా నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదన్నారు. లేజిస్లేచర్ మీటింగ్‌కి పార్టీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాకపోవడం శోచనీయం అన్నారు. రావాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ ఎమ్మెల్యే, ఉత్తమ ఎమ్మెల్సీ అవార్డులు ఇంకా నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది శాసన సభలో ఉన్నారన్నారు. శాసనసభ అందరికీ అని... కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌దో వేరే ఇంకా ఎవరిదో కాదన్నారు. శాసనసభ ఏ ఒక్కరిదో కాదని, ఈ ట్రైనింగ్ సెషన్స్‌కు అందరికీ ఆహ్వానం పంపామని తెలిపారు. పాత రోజుల్లో సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు ఉన్నా సభలో ఎవరి పాత్ర వారు పోషించారన్నారు. తాను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. నేను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీ ప్రతిపక్షానికి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు అందరూ శాసనసభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలి. ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండకండి. ఎప్పుడు మాట్లాడే అవకాశం దొరుకుతుందా అనే దాని కోసం చూసే వాళ్ళం అన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని ఎక్కువ రోజులు నడిపితే అంత మంచిదన్నారు. 2014 నుంచి కేవలం 4 నుంచి 5 రోజులు మాత్రమే సమావేశాలు నడుపుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మాత్రం కచ్చితంగా వీలైనన్ని ఎక్కువ రోజులు నడిపించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.