KTR: ‘ఈ అద్భుత మానవ నిర్మితానికి కేసీఆర్‌కి మరోసారి సెల్యూట్’.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తోన్న

Update: 2024-07-20 11:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తోన్న విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు పనికి రాదన్న మేడిగడ్డ బ్యారేజ్ గోదావరి నది నుండి ఉధృతంగా వస్తోన్న వరదను తట్టుకుని నిలబడిందని.. ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజ్‌కు వస్తోన్న వరద ప్రవాహానికి సంబంధించిన వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందన్నారు. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయి.. కానీ కేసీఆర్ సమున్నత సంకల్పం జై కొడుతోంది.. జల హారతి పడుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో లక్ష కోట్లు వృధా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయి.. కానీ మేడిగడ్డ బ్యారేజీ మాత్రం మొక్కవోని దీక్షతో నిలబడిందని.. కొండంత బలాన్ని చాటిచెబుతోందన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దశాబ్దాలుగా దగాపడ్డ ఈ తెలంగాణ నేలకు.. ఇప్పటికీ.. ఎప్పటికీ మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే “మేటి”గడ్డ అని అన్నారు. కాళేశ్వరమే కరువును పారదోలే కల్పతరువని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన ఈ మానవ నిర్మిత అద్భుతానికి కేసీఆర్‌కు తెలంగాణ సమాజం పక్షాన మరోసారి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.


Similar News