స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కాంగ్రెస్ ఫిక్స్ చేసుకున్న టార్గెట్ ఇదే..!

కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.

Update: 2024-06-07 02:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ, లోక్‌సభలో వచ్చిన ఓట్ల శాతం కంటే రెట్టింపు స్థాయిలో తెచ్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్నది. దాదాపు 70 శాతం ఓట్లను సాధించాలని భావిస్తున్నది. తద్వారా పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరగడమే కాకుండా, పదేళ్ల పాటు ఓటు బ్యాంక్ పదిలంగా ఉంటుందనేది పార్టీ ఆలోచన. ఈ మేరకు టీపీసీసీ కార్యవర్గం ఓటు బ్యాంక్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.5 శాతం ఓట్లు రాగా, లోక్‌సభ ఎన్నికల్లో 41 శాతం వచ్చాయి. దీన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో 70 శాతానికి పెంచాలని టీపీసీసీ నిర్ణయం తీసుకున్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కొత్త టాస్క్‌ను ఇవ్వనున్నారు. ఒకటి రెండు రోజుల్లో సీఎం పార్టీకి చెందిన కీలక నేతలతో రివ్యూ నిర్వహించే అవకాశం ఉన్నదని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. రాష్ట్రంలో పవర్‌లో ఉన్నందున స్థానిక సంస్థల్లో ఓటు బ్యాంక్‌ను పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదని టీపీసీసీ నేతలు ధీమాను వ్యక్తం చేయడం గమనార్హం.

ఏం చేద్దాం ?

లోక్‌సభలో వచ్చిన ఓట్ల శాతంతో పోల్చితే లోకల్ బాడీ ఎన్నికల కోసం పార్టీ పెట్టుకున్న లక్ష్యం దాదాపు రెట్టింపు స్థాయిలో ఉన్నది. ఈ మేరకు ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యేందుకు చేయాల్సిన కార్యకలాపాలు, ప్లానింగ్, వ్యూహాలపై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నది. ఏం చేస్తే, ఆ స్థాయిలో ఓట్ల శాతాన్ని చేరుకోవచ్చని స్థానిక ఎమ్మెల్యేల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇందు కోసం డీసీసీలంతా కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ ఆయా నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు తెలిసింది.

బీఆర్ఎస్ కేడర్‌కు ఎర?

ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ బీజేపీకి కన్వర్ట్ అయ్యాయని కాంగ్రెస్ బలంగా నమ్ముతున్నది. ఇందుకు ఊదాహరణకు మెదక్, మహబూబ్‌నగర్ స్థానాల్లో బీజేపీ గెలిచిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి పోకుండా ముందస్తుగా జాగ్రత్త పాడాలని పార్టీ భావిస్తుంది. ఇందు కోసం బీఆర్ఎస్ గ్రౌండ్ కేడర్‌ను కాంగ్రెస్‌లోకి లాగేయాలని ప్లాన్ చేస్తున్నది. స్టేట్, సెంట్రల్‌లో పవర్‌లో లేని పార్టీలో కొనసాగడం వలన ఉపయోగం లేదని బీఆర్ఎస్ స్థానిక లీడర్లు, నాయకత్వానికి కాంగ్రెస్ కన్విన్స్ చేయనున్నది. వీలైనంత ఎక్కువ చేరికలు ఈ నెలలోనే జరిగేలా ప్రణాళికను రూపకల్పన చేస్తున్నారు.


Similar News