Farmers Released: సంగారెడ్డి సెంట్రల్ జైలు వద్ద ఉత్కంఠ.. జైలు నుంచి లగచర్ల రైతులు విడుదల

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-12-20 03:19 GMT

దిశ, వెబ్‌డెస్క్/ సంగారెడ్డి అర్బన్: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన లగచర్ల (Lagacharla) ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంగారెడ్డి జైల్లో 37 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న 17 మంది రైతులు ఇవాళ ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వస్తూనే వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు వారికి గిరిజన సంఘాలు, బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. అయితే, ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులకు నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు (Nampally Court Grants Bail) చేసిన విషయం తెలిసిందే. అయితే, గురువారమే రైతులు జైలు నుంచి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ జైలు అధికారులకు ఆలస్యంగా బెయిలు పత్రాలు అందాయి. దీంతో ఇవాళ ఉదయం జైలు నుంచి రైతులు విడదలయ్యారు.

కాగా, ఇదే కేసులో A1గా ఉన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి (Patnam Narender Reddy)తో పాటు మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ (Bail) మంజూరు చేసింది. నరేందర్‌రెడ్డి (Narender Reddy)కి రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, 3 నెలల పాటు ప్రతి వారం రోజులకు ఒకసారి బొంరాస్‌పేట ఎస్‌హెచ్‌వో (Bomraspet SHO) ఎదుట హాజరై విచారణకు సహకరించాలని నాంపల్లి కోర్టు (Nampally Court) ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇదే కేసులో నిందితులు ఉన్న ప్రతి ఒక్కరూ రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలని, ప్రతి వారం పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతులు విధించింది. అయితే, కేసులో ప్రధాన నిందితుడు భోగమోని సురేశ్‌ (Bhogamoni Suresh)తో పాటు మరో ఏడుగురికి బెయిల్ లభించలేదు.

మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం

తమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే పోరాటం చేశామని.. ఈ విషయంలో మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటామనే దానిపై చర్చించి ముందడుగు వేస్తామని రైతులు తెలిపారు. జీవితంలో చూడని బాధను జైల్లో చూసి ఎంతో కృంగిపోయామని వాపోయామని అన్నారు. మిగతా పది మంది రైతులను కూడా విడుదల చేసి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News