ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన
రైతులకు పంట వేసిన నాటి నుంచి అమ్ముకునే వరకు అన్ని ఇబ్బందులే ఎదురు అవుతున్నాయని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిశ, తూప్రాన్: రైతులకు పంట వేసిన నాటి నుంచి అమ్ముకునే వరకు అన్ని ఇబ్బందులే ఎదురు అవుతున్నాయని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తూప్రాన్ మండల పరిధిలోని శబాష్ పల్లి వద్ద రోడ్డుకు అడ్డుగా నిల్చుని వాహనాలను అడ్డుకున్నారు రైతులు. ధాన్యం తరలించే వరకు రోడ్డుపై నుండి వెళ్ళేది లేదు అంటే తేల్చి చెప్పడంతో వాహనాలకు అంతరాయం కలిగింది. పంట పండించి రోడ్డుపై ఆరబోసి నెల రోజుల సమయం గడుస్తున్నా తరలించే వారు చేతులెత్తేశారని ఆరోపించారు. సంబంధిత సివిల్ సప్లై అధికారులు జోక్యం చేసుకుని లారీ మాట్లాడి పంపడంతో రైతులు నిరసన విరమించారు.
ఎక్కడ చూసినా అదే పరిస్థితి..
మండల పరిధిలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎమ్మార్వో అర్టిఓ సివిల్ సప్లై అధికారులు, నాయకులు రోడ్లపైకి వచ్చి ధాన్యం తరలింపు కోసం వాహనాలు ఆపి కొనుగోలు కేంద్రాల వద్దకు పంపుతున్నారు. ఇది గమనించిన లారీ డ్రైవర్లు వేరే దారిలో వెళ్లి తప్పించుకుంటున్నారు. ధాన్యం తీసుకెళ్తే అక్కడ ఎన్ని రోజులు వేచి ఉండాలో తెలియడం లేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.