మా సంగతేంటి? కేసీఆర్‌పై రైతులు ఆగ్రహం

దిశ, తెలంగాణ బ్యూరో: ‘యాసంగిలో బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం కరాఖండిగా చెప్పినందున

Update: 2022-04-13 00:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: 'యాసంగిలో బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం కరాఖండిగా చెప్పినందున యాసంగిలో రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం ధాన్యాన్ని తీసుకుంటేనే రాష్ట్రం సేకరణ మొదలు పెడుతుందని, రాష్ట్రానికి కొని, నిల్వ చేసే శక్తి ఉండదు. రైతులు తిండికోసమో.. విత్తనాల కంపెనీలతో ఒప్పందం ఉంటేనో, వ్యాపారులతో మాట్లాడుకొని ఉంటేనో వేసుకోవచ్చు'-2021 నవంబర్ 29న ప్రగతి భవన్ లో మీడియాతో సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు చాలామంది రైతులు యాసంగి సాగుకు దూరయ్యారు. శ్రమించడమే తెలిసిన రైతులకు ఎలా అమ్ముకోవాలో తెలియక సాగు భూములను పడావు బెట్టారు. వరిసాగు తప్ప ప్రత్యామ్నాయ పంట సాగు రాక... మార్కెట్ సదుపాయం సైతం లేక సాగుకు దూరమయ్యారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశించినప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేయడంతో 20లక్షల ఎకరాల భూమి పడావుబడింది. గ్రామాల్లో సైతం ఉపాధి కరువైంది. ఏం చేయాలో తెలియక పోట్టచేతబట్టుకొని చిన్న, సన్నకారు రైతులు ఉపాధికోసం ఉన్నవారి నుంచి పట్నం వలసవెళ్లారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు లక్షల ఎకరాల సాగు పెరిగిందని ప్రభుత్వం పేర్కొంటుంది. అందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేనని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు మిషన్ కాకతీయ, ఉచిత విద్యుత్, ఉచితంగా నీటి తీరువాతోనే సాగు పెరిగిందని సీఎం కేసీఆర్ సైతం ప్రతి సమావేశంలో పేర్కొంటూనే ఉన్నాయి. అయితే వానాకాలంలో 56 లక్షల ఎకరాల్లో రైతులు వరిపంట వేశారు. అయితే కేంద్రం యాసంగిలో పార్ బాయిల్డ్ రైస్ మాత్రమే కొంటామని చెబుతోందని.. యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. ఒకవేళ వేసినా ప్రభుత్వం కొనబోదని.. కొనుగోలు కేంద్రాలు ఉండవని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకోకుంటే మనం ఎక్కడ పెడతాం... మనకు గోదాములు ఉండవ్.. నిల్వ చేసే పరిస్థితి ఉండదని, బియ్యమైనా, వడ్లయినా నిల్వ చేయడానికి, కాపాడటానికి శాస్త్రీయ పద్దతి ఉంటుంది.. వాటిని పీరియాడికల్ గా నిల్వ చేయాలి.. తీసేటప్పుడు కూడా పద్దతిగా తీయాలని, ఆ టెక్నాలజీ రాష్ట్రాల దగ్గర ఉండదని స్పష్టం చేశారు. దీంతో సన్న, చిన్నకారు రైతులు సాగుకు దూరమయ్యారు. పది ఎకరాలు ఉన్న రైతులు రెండు లేక మూడు ఎకరాలు మాత్రమే సాగు చేశారు. కొంతమంది రైతులు ముందుగా సాగు చేసి ఇప్పటికే మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఈ తరుణంలోనే కేసీఆర్ మళ్లీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం... చివరి గింజవరకు కొనుగోలు చేస్తామని కేసీఆర్ మంగళవారం ప్రకటించారు. దీంతో రైతుల్లో అయోమయం నెలకొంది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.

20 లక్షలు తగ్గిన సాగు...

వానాకాలంలో రైతులు 56 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు 20 లక్షల ఎకరాల్లో సాగు తగ్గించారు. కేవలం 36లక్షల ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేశారని ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే సాగు చేసిన రైతులకు భరోసానిస్తున్న కేసీఆర్... సాగుకు దూరమైన రైతులకు మాత్రం ఎలాంటి భరోసా ఇవ్వలేదు. యాసంగిలో పంట వేస్తే రైతుబంధు సైతం ఇవ్వబోమని మంత్రులు సైతం పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే సాగు చేయని రైతులకు రైతుబంధు తప్ప మరేమీ లేదు. గ్రామాల్లో ఉపాధి లేక ఉన్నగ్రామాలను విడిచి పట్టణాలకు పలువురు రైతులు వెళ్లారు. సాగు చేసిన రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం... సాగు చేయని రైతులను కూడా ఆదుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. సాగు చేస్తే తమకు పదిరూపాయలు వచ్చేవని, కానీ అటు సాగులేక, ఉపాధిలేక నగరాలకు వలసవెళ్లామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 20వేల వరకు నష్టపోయని ఆ పరిహారం మాకు ఇవ్వాల్సిందేనని, మేము రైతులమేనని, రాష్ట్ర వాసులమేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమకు సహయసహకారాలు అందించాలని కేసీఆర్ ను విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉపాధికోసం పట్టణాలకు వెళ్లా- నూనెముంతల ఆంజనేయులు, రైతు, ఎన్జీ కొత్తపల్లి

నాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయమని కేసీఆర్ చెప్పడంతో భూమిని పడావు పెట్టా. ఉపాధికోసం కుటుంబంతో సహా హైదరాబాద్ కు వెళ్లా. నాకున్న భూమిలో సాగు చేస్తే అన్ని ఖర్చులు పోయి 60వేల వరకు మిగిలేది. ఇప్పుడు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఉన్న ఊరును వదిలిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వమే పరిహారం చెల్లించి ఆదుకోవాలి.

కేసీఆర్ వద్దన్నందుకే సాగుచేయలేదు- దెంకల అంజయ్య, రైతు, శాలిగౌరారం

వరిసాగు చేయడమే తెలుసు. నాకున్న 3 ఎకరాల్లో రెండుపంటలు వరివేస్తా. ఈ సారి కేంద్రం ధాన్యం కొంటలేదని రాష్ట్రం కొనదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పడంతో ఎక్కడ అమ్ముకోవాలో తెలియక భూమిని పడావు పెట్టా. ఇప్పుడు ప్రభుత్వం కొంటుందని కేసీఆర్ చెప్పడంతో ఏం చేయాలో తెలియడం లేదు. కేసీఆర్ వద్దన్నందుకు సాగు చేయలేదు. ఇప్పుడు మమ్మల్ని కేసీఆర్ ఆదుకోవాలి.

రైతులను మోసం చేసినట్లే- గంట్ల వేణుగోపాల్ రెడ్డి, నల్లగొండ డీసీసీ ఉపాధ్యక్షుడు

కరెంటు, నీళ్లు ఉండి రైతులు కొంత మంది సాగుకు దూరమయ్యారు. కేసీఆర్ తెలంగాణ వచ్చాక రైతుల సంక్షేమం అని చెబుతూనే నడ్డి విరుస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పి ఇప్పుడు మరొక విధంగా మాట్లాడటం రైతులను మానసిక ఇబ్బందులకు గురిచేయడమే. కొనుగోలు చేస్తామనే విషయాన్ని ముందే చెబితే బాగుండేది. ఎకరా, రెండెకరాలు సాగు చేసిన రైతులు మధ్య వర్తులకు అమ్ముకొని ఎకరాకు 10వేలు నష్టపోయారు. పెట్టుబడి సైతం మిగలకుండా చేశారు. క్వింటాకు రూ.500లకు తక్కువగా దళారులకు అమ్ముకున్నారు. కేసీఆర్ ధర్నాతో ఒరిగేదేమీలేదు. ఇదే విషయాన్ని ముందే చెబితే రైతులంతా వరిసాగు చేసేవారు. ఉపాధికోసం పట్టణాలకు వలస పోయేది తప్పేది.

Tags:    

Similar News