రాష్ట్రంలో మరోసారి కుటుంబ సర్వే.. అసెంబ్లీ భట్టి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో కులగణనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-02-16 08:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కులగణనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ రాష్ట్రంలో కేవలం బీసీ కులగణన మాత్రమే కాదని అన్ని కులాల సర్వే చేస్తామన్నారు. కులగణన మాత్రమే కాదని ప్రతి ఇంటి సర్వే నిర్వహించి వారి ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరిస్తామన్నారు. శుక్రవారం అసెంబ్లీలో బీసీ కులగణనపై జరిగిన చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు. రాష్ట్రంలో సంపద అంత ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది? ఆ సంపదను జనాభా దామాషా ప్రకారం పంపిణీ ఎలా చేయాలో అనేది అందరి సలహాలు, సూచనలు స్వీకరించి ముందుకు వెళ్తామన్నారు. ఈ సర్వే అనంతరం అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. బిహార్, కర్నాటకలో చేసిన సర్వేల అనుభవాలతో పాటు రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దనే సుప్రింకోర్టు తీర్పు వంటి అంశాలపై సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. తాము చేపట్టబోయే సర్వే వీటన్నింటికి సర్వరోగనివారిణిగా ఉండబోతున్నదన్నారు. 50 శాతం రిజర్వేషన్లు దాటవద్దని సుప్రీంకోర్టు చెబుతూనే ఒక వేళ బలహీన వర్గాల సంఖ్య 50 శాతం కంటే ఎక్కువ ఉంటే సపోర్టింగ్ గా ఉండే గణాంకాలను సర్వేచేసి సమర్పించాలని చెప్పిందన్నారు. ఆ గణాంకాల కోసం అవసరమైన సర్వేను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి.. ఇవన్నీ జరగాల్సి ఉండే అని ఇవాళ గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారని వీటిని చేయడానికి మేమేమన్నా వద్దన్నామా అని భట్టి ప్రశ్నించారు. తాము చేయబోయే సర్వే ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులకు పునాదిగా మారబోతున్నదని అటువంటి తీర్మానాన్ని తీర్మానాన్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిందన్నారు. ఈ సర్వే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని కన్ఫ్యూజన్ ఉన్నదల్లా బీఆర్ఎస్ కేనన్నారు.

Tags:    

Similar News