Minister Komatireddy : బీఆర్ఎస్ హయాంలో అన్నీ స్కాములే

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు చచ్చిపోతుందని, కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా ఎవరో తెలియదని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Update: 2024-09-22 11:30 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు చచ్చిపోతుందని, కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా ఎవరో తెలియదని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆహ్వానం మేరకు ఆదివారం ఆలేరు మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆలేరు పట్టణంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

ఆ‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్‌ లు పార్టీ వదిలిపెట్టి పోతుండడంతో దిక్కుతోచని స్థితిలో కేటీఆర్ మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. కేటీఆర్ పది ఏండ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి రెండు లక్షల కోట్ల ఆయన కుటుంబం దోచుకుందని ఆరోపించారు.‌ రూ.‌8888 వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి కేటీఆర్ లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‌కాళేశ్వరం స్కామ్ చేశారని, మేడిగడ్డ కూలిపోయిందని, ఎప్పుడు ఎవరు జైలుకు పోతారో తెలియదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ ,హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి వచ్చారని ఆరోపించారు.

ప్రభాకర్ రావు వస్తే వీళ్ళు జైలుకు పోతారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పి తమ ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. మంచి పనులు చేసిన కేటీఆర్ కు దోపిడే కనిపిస్తుందని, ఆయన కుటుంబం లాగా దోచుకోరని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, కాని తమ‌ పాలనలో ఒకటో తేదీనే జీతం ఇస్తున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా రాదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడిది, ప్రతిపక్ష నాయకుడు నువ్వా‌ లేక మీ నాయనా‌న లేక హరీష్ రావా, మీ చెల్లెన ,‌ నువ్వా కేటీఆర్ ముందు అది తేల్చుకో అంటు డిమాండ్ చేశారు.‌ మీరు నలుగురు కలిసి ప్రతిపక్ష నేత పాత్ర కోసం పోటీ పడుతున్నారని అన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… వ్యవసాయ శాఖ తరపున మార్కెట్ కమిటీలకు మంచి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. గోదాముల కెపాసిటీ పెంచే అంశం పైన సాధ్యసాధ్యాలు చూసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆలేరు మార్కెట్ కమిటీకి అవసరమైన గోదాములను మంజూరు చేసేందుకు తమ శాఖ తరపున కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన చైతన్య మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మదర్ గౌడ్, డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి, నియోజకవర్గ స్థాయి మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, ముఖ్య నాయకులు మార్కెటింగ్, అగ్రికల్చర్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News