అక్రిడేషన్ ఉంటేనే రవీంద్ర భారతి లోకి ఎంట్రీ.. ఆంక్షలు ఎత్తివేయాలని టీడబ్ల్యూజేఎఫ్
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు పౌర సంబంధాలశాఖ కేటాయించిన అక్రిడిటేషన్ కార్డు ఉంటేనే..
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు పౌర సంబంధాలశాఖ కేటాయించిన అక్రిడిటేషన్ కార్డు ఉంటేనే రవీంద్రభారతి ప్రోగ్రామ్స్ కవరేజ్ చేయడానికి అనుమతి ఉంటుందని రవింద్రభారతి సిబ్బంది బోర్డు పెట్టారు. లేనిచో పాత్రికేయులకు ప్రవేశం లేదని తేల్చి చెప్పింది. కార్యక్రమాలు నిర్వహించే కళా సంస్థలు కూడా అక్రిడిటేషన్ కార్డు ఉన్న పాత్రికేయులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని సూచించింది. లేనిచో తదుపరి జరిగే పర్యవసానాలకు రవీంద్రభారతి యాజమాన్యం బాధ్యత వహించదని రవీంద్రభారతి సెక్రటరీ బోర్డుపై పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జేఎఫ్) స్పందించింది.
ఈ నిబంధన దుర్మార్గమని, రవీంద్రభారతి యాజమాన్యం ఇలా బోర్డు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. వార్తల కవరేజికి అక్రిడిటేషన్ కార్డు లింక్ పెట్టడం ఏమిటి? ఇది చట్టవిరుద్ధమని ఆరోపించింది. ఆర్ఎన్ఐ నిబంధనలకు విరుద్ధమని, ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదని స్పష్టం చేసింది. ఆర్ఎన్ఐ గుర్తింపు పొందిన పత్రికల్లో, టీవీ న్యూస్ చానల్స్‌లో పని చేస్తున్న జర్నలిస్టులందరూ జర్నలిస్టులేనని తెలిపింది. ప్రభుత్వ అధికారులకు ఈ విషయం తెలియదా? అని ప్రశ్నించింది. అక్రిడిటేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్ట్ అనడం, వాళ్ళే వార్తల కవరేజికి రావాలని ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని పేర్కొంది. రవీంద్రభారతిలో పెట్టిన బోర్డును వెంటనే తొలగించాలని, లేదంటే దీనిపై జర్నలిస్టుల ఆందోళన చేయక తప్పదని హెచ్చరించింది.